'సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేను లైవ్‌లో చూశా.. '

29 Sep, 2017 20:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అసలు భారత్ సర్జికల్‌ దాడులు నిర్వహించిందా? నిజంగా నిర్వహిస్తే దానికి సంబంధించిన ఆధారాలు ఏవి ? అంటూ పాకిస్థాన్‌తోపాటు భారత్‌లో కూడా పలువురు కేంద్ర ప్రభుత్వాన్ని, మిలిటరీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, ఆ దాడులు నిర్వహించే సమయంలో ఆర్మీ అధికారులు ఢిల్లీలో లైవ్‌ స్ట్రీమ్‌ చేశారంట. ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను హతం చేసే సమయంలో వైట్‌ హౌస్‌లో ఉండి నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఎలా వీక్షించారో ఢిల్లీ, ఉదమ్‌ పూర్‌లోని ఆర్మీ ఉన్నతకార్యాలయంలో లైవ్‌ స్ట్రీమ్‌ ద్వారా వీక్షించారు. ఈ విషయాన్ని ఆ సమయంలో ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన డీఎస్‌ హుడా అనే ఆర్మీ అధికారి తెలియజేశారు.

'అవును.. మాకు లైవ్‌ ఛాయా చిత్రాలు వచ్చాయి. ఆ సమయంలో నేను ఉదమ్‌పూర్‌లో ఆపరేషన్‌ నిర్వహణ రూమ్‌లో కూర్చొని ఉన్నాను. లక్షిత ప్రాంతాలపై మన సైనికులు ఎలా దాడి చేశారో నేను లైవ్‌లో చూశాను. అదే మొత్తం లైవ్‌ను ఢిల్లీలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు కూడా పంపించాం' అని చెప్పారు. అయితే, ఢిల్లీలో లైవ్‌ను ఎవరు చూశారని ప్రశ్నించగా 'ఆ లైవ్‌ ఫుటేజీని ఢిల్లీలో ఎవరు చూశారో నాకు తెలియదు.. మేం మాత్రం ఉదమ్‌పూర్‌లో చూశాం.. ఇందుకోసం ఏ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారనే విషయం నేను చెప్పను.. కానీ, ఎక్కడి దాడినైనా లైవ్‌లో పంపించగల సామర్థ్యం భారత ఆర్మీకి ఉంది' అని చెప్పారు. దాడిలో పాల్గొని సైనికులు ఉదయం 6.30గంటలకు తిరిగొచ్చేశారని తెలిపారు.

మరిన్ని వార్తలు