భద్రతను కట్టుదిట్టం చేయనున్న రైల్వే శాఖ

7 Jan, 2019 03:44 IST|Sakshi

రైల్వేస్టేషన్‌లోకి 15–20 నిమిషాల ముందుగానే ప్రయాణికులు

న్యూఢిల్లీ: విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా ప్రయాణికులు రైలు బయలుదేరేందుకు 15–20 నిమిషాల ముందుగా స్టేషన్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైల్వేస్టేషన్ల ప్రవేశమార్గాలను మూసివేస్తారు. ఉత్తరప్రదేశ్‌ లోని అలహాబాద్, కర్ణాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్లలో దీన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ విషయమై రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్పీఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 202 రైల్వే స్టేషన్లలో ఈ ఏకీకృత భద్రతా వ్యవస్థ(ఐఎస్‌ఎస్‌)ను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రయాణికులు ఓసారి లోపలకు వచ్చాక ఎన్ని రైల్వేస్టేషన్లలో ప్రవేశమార్గాలను మూసివేయగలమో పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

వీటిలో కొన్నిచోట్ల గోడలు నిర్మించడం, మరికొన్ని చోట్ల ఆర్పీఎఫ్‌ సిబ్బందిని మోహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏకీకృత భద్రతా వ్యవస్థలో భాగంగా ఈ 202 రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు, యాక్సస్‌ కంట్రోల్, బ్యాగేజీ–ప్రయాణికుల స్క్రీనింగ్‌ వ్యవస్థ, బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసే పరికరాలను అమరుస్తామని కుమార్‌ తెలిపారు. సాధారణంగా విమాన ప్రయాణికులు కొన్ని గంటల ముందుగా ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారనీ, కానీ తాజా విధానంలో రైల్వే ప్రయాణికులు కేవలం 15–20 నిమిషాల ముందు స్టేషన్‌కు వస్తే సరిపోతుందని వెల్లడించారు. స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికుల్లో కొందరిని మాత్రమే ర్యాండమ్‌గా తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రయాణికుల్ని స్టేషన్‌ ప్రాంగణం బయటే తనిఖీ చేసి లోపలకు అనుమతిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.385.06 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు