మహమ్మారితో మనుగడ సాగించాల్సిందే..

3 May, 2020 19:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ‘ఢిల్లీని తిరిగి తెరిచే సమయం ఆసన్నమైంది..మనం కరోనా వైరస్‌తో జీవించేందుకు సిద్ధంగా ఉండా’లని సీఎం వ్యాఖ్యానించారు. కంటైన్మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉందని అన్నారు. కంటైన్మెంట్‌ జోన్లను పూర్తిగా మూసివేస్తామని, ఇతర ప్రాంతాలను గ్రీన్‌జోన్లుగా ప్రకటించి సరి బేసి రోజుల్లో షాపులను తెరిపించేందుకు ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు.

లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత కొన్ని కేసులు వెలుగుచూస్తే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్‌ ప్రకటించారు. ప్రజా రవాణా ఉండదని..ప్రైవేట్‌ వాహనాలు, కార్లు, బైక్‌ల రాకపోకలను అనుమతిస్తామని చెప్పారు. కార్లలో డ్రైవర్‌తో కలిపి ముగ్గురిని, బైక్‌లపై కేవలం ఒకరినే అనుమతిస్తామని అన్నారు. ప్రైవేట్‌ కార్యాలయాలను కేవలం 33 శాతం సిబ్బందితోనే అనుమతిస్తామని, ఐటీ కంపెనీలు, ఈకామర్స్‌ కార్యకలాపాలకూ ఇదే నిబంధన వర్తిస్తుందని అన్నారు. వివాహాలకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తామని సీఎం వెల్లడించారు.

చదవండి : వలస కూలీల నుంచి వసూళ్లా..?

మరిన్ని వార్తలు