అవినీతిలో రైల్వేశాఖ ఫస్ట్

14 Apr, 2017 00:10 IST|Sakshi
అవినీతిలో రైల్వేశాఖ ఫస్ట్

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 2016లో నమోదైన అవినీతి కేసుల్లో రైల్వే శాఖ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర విజిలెన్స్‌ కమిషన్ ‌(సీవీసీ) పార్లమెంటుకు సమర్పించిన తన వార్షిక నివేదికలో తెలిపింది. అంతేకాకుండా అవినీతి కేసుల సంఖ్య అంతకు ముందేడాది కంటే 67 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2015లో ప్రభుత్వాధికారులపై మొత్తం 29,838 అవినీతి కేసులు ఉండగా, 2016 నాటికి అవి 67 శాతం పెరిగి 49,847కు చేరుకున్నట్లు కమిషన్‌ పేర్కొంది.

రైల్వేల్లో అత్యధికంగా 11 వేల కేసులు నమోదు కాగా 8,852 కేసులు పరిష్కారమయ్యాయని, 2,393 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సీవీసీ స్పష్టం చేసింది. రైల్వేల్లో దాదాపు 1,054 కేసులు ఆరు నెలల కంటే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాతంలో 2015తో పోలిస్తే అవినీతి కేసుల సంఖ్య భారీగా 5,139 నుంచి 969కి తగ్గినట్లు కమిషన్ వెల్లడించింది. కేం‍ద్ర హోం మంత్రిత్వ శాఖలో 6,513, ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులపై 6,018, పెట్రోలియం మంత్రిత్వ శాఖలో 2,496 అవినీతి కేసులు నమోదైనట్లు సీవీసీ పేర్కొంది. ఆదాయపు పన్నుశాఖలో 2016లో 2,646 కేసులు నమోదవగా, పట్టణాభివృద్ధి శాఖలో 2,514 కేసులు నమోదైనట్లు కమిషన్‌ స్పష్టం చేసింది.

టెలీ కమ్యూనికేషన్‌ ఉద్యోగులపై 2,393 కేసులున్నట్లు వెల్లడించింది. కార్మిక శాఖ, ఆహారం, వినియోగ దారుల వ్యవహారాల శాఖల్లో వరుసగా 1,746, 1,668 కేసులు ఉన్నట్లు సీవీసీ తెలిపింది. కస్టమ్స్‌, ఎక్సైజ్‌ శాఖలో 1,420, ప్రభుత్వ రంగ బీమా కంపెనీల్లో 1,376, ఉక్కు మంత్రిత్వ శాఖలో 1,369 కేసులు నమోదైనట్లు కమిషన్‌ నివేదికలో పేర్కొంది. బొగ్గు మంత్రిత్వ శాఖ, సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖల్లో వరుసగా 759, 724 కేసులు ఉన్నట్లు వెల్లడించింది. రక్షణ శాఖలో 689, కుటుంబ మంత్రిత్వ శాఖ ఉద్యోగులపై 571, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖలో ఉద్యోగులపై 479 కేసులు నమోదైనట్లు సీవీసీ తెలిపింది.

మరిన్ని వార్తలు