రాజస్ధాన్‌ : ఈడీ దాడుల కలకలం

22 Jul, 2020 12:24 IST|Sakshi

ఎరువుల కుంభకోణం

సాక్షి, న్యూఢిల్లీ : ఫర్టిలైజర్‌ కుంభకోణానికి సంబంధించి రాజస్ధాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సోదరుడి ఆస్తులపై ఈడీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టిందని దర్యాప్తు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. సచిన్‌ పైలట్‌ వర్గం తిరుగుబాటుతో అశోక్‌ గహ్లోత్‌ తన ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉండగా, ఆయన సోదరుడిపై ఈడీ దాడులు జరగడం విశేషం. అగర్షియన్‌ గహ్లోత్‌కు చెందిన కంపెనీ రైతులకు సబ్సిడీ ధరపై అందించే ఎరువులను కంపెనీలకు విక్రయించారని, ఎగుమతులను నిషేధించిన ఈ ఎరువులను ఆయా కంపెనీలు ఎగుమతి చేసేవని ఈడీ ఆరోపిస్తోంది.

సబ్సిడీ ఎరువు ఎంఓపీకి ఇండియన్‌ పొటాష్‌ లిమిటెడ్‌ ఆధీకృత దిగుమతిదారని, ఈ ఎరువును రైతులకు సబ్సిడీ ధరలకు అందచేస్తారని ఈడీ పేర్కొంది. అగర్షియన్‌ గెహ్లోత్‌కు చెందిన అనుపమ్‌ కృషి సంస్థ 2007 నుంచి 2009 మధ్య సబ్సిడీ ధరలపై ఎంఓపీని కొనుగోలు చేసి దాన్ని రైతులకు పంపిణీ చేయకుండా ఇతర కంపెనీలకు విక్రయించిందని, ఆ కంపెనీలు వాటిని మలేషియా, సింగపూర్‌లకు ఎగుమతి చేశారని ఈడీ వర్గాలు ఆరోపించాయి. 2012-13లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఈ కుంభకోణాన్ని వెలికితీశారు. కాగా కొందరు దళారీలు తమ వద్ద రైతులకు పంపిణీ చేసేందుకు ఎరువులను కొని వాటిని రైతులకు పంచకుండా ఎగుమతులు చేశారని అప్పట్లో అగర్షియన్‌ గెహ్లోత్‌ తమ సంస్ధపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. చదవండి : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు సచిన్‌ పైలట్‌ నోటీసు

మరిన్ని వార్తలు