జ‌ర్న‌లిస్ట్ అరెస్ట్.. వారి పేర్లు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌నేనా?

18 Jul, 2020 18:48 IST|Sakshi
జ‌ర్న‌లిస్టు రాజీవ్ శర్మ

గువ‌హ‌టి : అర్థ‌రాత్రి ఓ జ‌ర్న‌లిస్టు ఇంటిపై దాడి, త‌ద‌నంత‌రం ఆయ‌న తండ్రి గుండెపోటుతో మ‌ర‌ణించ‌డం అస్సాం వ్యాప్తంగా సంచ‌ల‌నానికి దారితీసింది. వివ‌రాల ప్ర‌కారం.. ధూబ్రీ నగర ప్రెస్ క్లబ్ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ ఓ చాన‌ల్ కరస్పాండెంట్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటీవల పశువుల స్మగ్లింగ్ కుంభకోణంపై వరుస కథనాలు రాశారు. దీని వెనుక బ‌డా రాజ‌కీయ నేత‌ల హ‌స్తం ఉంద‌ని ప‌లు క‌థ‌నాలు తెర‌మీద‌కి వ‌చ్చాయి. సీన్ క‌ట్ చేస్తే.. ఓ కేసులో జ‌ర్న‌లిస్టు రాజీవ్ శర్మను నిందితుడిగా చేరుస్తూ అతడి ఇంటిపై పోలీసులు దాడి చేసి శ‌ర్మ‌ను అరెస్టు చేశారు. దీంతో ఆయ‌న తండ్రి తీవ్ర ఆందోళ‌న‌కు గురై గుండెపోటుతో కన్నుమూశారు. అదే రోజున రాజీవ్ శ‌ర్మ‌కు మధ్యంతర బెయిల్ లభించడంతో స్థానికంగా కొంత‌మంది జర్నలిస్టులు, బంధువుల సమక్షంలో తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. (పాక్‌ దుశ్చర్య, ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి)

ఉద్దేశ‌పూర్వ‌కంగానే జ‌ర్న‌లిస్టు రాజీవ్ శ‌ర్మ‌ను అరెస్ట్ చేసి అత‌ని తండ్రి చావుకు కార‌ణ‌మ‌య్యార‌ని గువాహటి ప్రెస్ క్లబ్ అధ్య‌క్షుడు మనోజ్ కుమార్ నాథ్ ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌పై  రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలంటూ  ప్రెస్ క్లబ్ కార్యదర్శి సంజయ్‌రే ఒక ప్రకటనలో కోరారు. ఈ కేసు విష‌యంపై ప‌లు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శలు వ‌స్తుండ‌టంతో ధూబ్రీ పోలీసు చీఫ్ ను బదిలీ చేశారు.  పశువుల అక్రమ రవాణాకు సంబంధించి త‌న ప్ర‌మేయం ఉంద‌న్న వార్త‌ల‌ను  ధుబ్రీ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) బిస్వాజిత్ రాయ్ ఖండించారు. రాజీవ్ శ‌ర్మ త‌న‌ను అక్ర‌మంగా ఈ కేసులో ఇరికించార‌ని, త‌న‌ను రూ. 8 లక్షలు కూడా డిమాండ్ చేసిన‌ట్లు ఆరోపించారు. ప్ర‌స్తుతం ఈ కేసును  క్రైం డిపార్టుమెంటుకు బదిలీ చేశారు. (రోడ్డుపై తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం)

మరిన్ని వార్తలు