మోదీ పాలనలో భయంభయం

10 Jun, 2015 04:21 IST|Sakshi
మోదీ పాలనలో భయంభయం

మతపరమైన చీలికలను రెచ్చగొడుతున్నారు: సోనియా ధ్వజం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ .. నరేంద్రమోదీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. మతపర చీలకను రెచ్చగొడుతూ ప్రజల్లో భయం, విపత్తు పొంచివుందన్న ఆందోళన పూరిత వాతావరణం నెలకొల్పుతూ ప్రమాదకరమైన మాయా క్రీడ నడుపుతోందని ధ్వజమెత్తారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన సంక్షేమ రాజ్య నిర్మాణాన్ని ఒక పద్ధతి ప్రకారం ధ్వంసం చేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందన్నారు.

భూసేకరణ బిల్లు, ఆహార భద్రత చట్టం విషయంలో ప్రభుత్వ చర్యలను బలంగా వ్యతిరేకించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారమిక్కడ జరిగిన కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సదస్సులో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత జరుగుతున్న ఆ పార్టీ సీఎంల తొలి సదస్సు ఇది. సోనియా ప్రసంగంలోని

ముఖ్యాంశాలు...
‘‘ప్రధాని.. ఒకవైపు సుపరిపాలనలో, రాజ్యాంగ విలువల విషయంలో తానే విజేతనని తనను తాను చూపుకోవాలనుకుంటారు. మరోవైపు.. తన సహచరులు చాలా మంది దుష్ట ప్రకటనలు చేయటానికి, మతపరమైన చీలికను రెచ్చగొట్టటానికి అనుమతిస్తారు. ఇది ఇప్పటికే మన లౌకిక నిర్మాణాన్ని దెబ్బతీసింది. భయం, విపత్తు పొంచివుందన్న ఆందోళనకర వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించారు.
అధికారం, పెత్తనం అంతా అసాధారణంగా కేంద్రీకృతం చేయటం జరుగుతోంది. పార్లమెంటరీ పద్ధతులను ఉద్దేశపూర్వకంగా అతిక్రమించటం, న్యాయవ్యవస్థకు హెచ్చరికలు మోదీ పాలన గుర్తులుగా ఉన్నాయి.
ఆహార భద్రత చట్టం వర్తించే ప్రజల సంఖ్యను 67 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన ఆందోళనకరం.   
ప్రణాళికాసంఘం రద్దు 11 ప్రత్యేక తరగతి రాష్ట్రాలకు గట్టి దెబ్బ. వాటిలో ఏడు రాష్ట్రాల సీఎంలు ఈ సదస్సులో ఉన్నారు. రాష్ట్రాలకు మరిన్ని నిధులు ఇచ్చే ముసుగులో వాటిపై కేంద్రం అదనపు భారం మోపింది.  కార్పొరేట్ సంస్థలకు మాత్రం భారీ పన్ను మినహాయింపులిచ్చింది.  
అంతర్గత రాజకీయాలను విదేశాల్లో వినిపించటం మోదీ కొత్తగా మొదలుపెట్టారు. ఆయన ప్రకటనల్లో గొప్పలు చెప్పుకోవటం, పచ్చి అబద్ధాలే ఉన్నాయి.  
జీఎస్‌టీ, యూఐడీ వంటి కీలకమైన అంశాలపై ఇంతకుముందు విమర్శలు చేసిన ప్రధాని ఇప్పుడు వాటి విలువలను గుర్తించినట్లున్నారు. కానీ.. భూసేకరణ,  ఆహార భద్రత చట్టం వంటి ఇతర అంశాల్లో ఆయన తిరోగమనాన్ని  వ్యతిరేకించాలి.  
యూపీఏ హయాం నాటి పేద ప్రజల అనుకూల విధానాలను ఎన్డీఏ పలచబారుస్తోందని వివరించటమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్ర మేనిఫెస్టోల అమలు గురించి ప్రజలకు చెప్పటమూ ముఖ్యం.   
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు అందించే ఉత్తమ నివాళి అవుతుంది.  
 
ఉత్తమ పాలనగా చూపాలి: రాహుల్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలోని ప్రతి రాష్ట్రమూ.. సమూలంగా మార్చివేసే రెండు లేదా మూడు పథకాలపై దృష్టి కేంద్రీకరించాలని, వాటిని దేశంలోనే ఉత్తమంగా మలచాలని సూచించారు. ‘‘కాంగ్రెస్ పాలనలో ఉన్న 9 రాష్ట్రాలు దేశంలో ఉత్తమ పాలనలో ఉన్న రాష్ట్రాలుగా మనం చూపాలి’’ అని సీఎంలకు సూచించారు.
 
మోదీ నాకన్నా మంచి సేల్స్‌మన్: మన్మోహన్
బలహీన రాష్ట్రాలు, అత్యంత పేద ప్రాంతాలకు సహాయపడిన ప్రణాళికాసంఘాన్ని తొందరపాటుతో రద్దు చేశారని మోదీ ప్రభుత్వాన్ని మాజీ ప్రధాని మన్మో హన్‌సింగ్ తప్పుపట్టారు. కాంగ్రెస్ సీఎం ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. తన తర్వాత ప్రధాని పదవి చేపట్టిన నరేంద్రమోదీ తనకన్నా మంచి ‘సేల్స్‌మన్’, ఈవెంట్ మేనేజర్ అని, తనకన్నా మంచిగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో జీఎస్‌టీ బిల్లు వంటి వాటిని అడ్డుకున్న బీజేపీ.. ఇప్పుడు అదే జీఎస్‌టీని తెచ్చే విషయంలో తామే గొప్ప విజేతలమని చెబుతోందన్నారు.

మరిన్ని వార్తలు