'మా 88 ఏళ్ల సీఎంకు చేవ తగ్గలే'

7 Dec, 2015 17:38 IST|Sakshi
'మా 88 ఏళ్ల సీఎంకు చేవ తగ్గలే'

చండీగఢ్: తమ ముఖ్యమంత్రిపై వయోభారం పడినా అది ఏమాత్రం ప్రభావం చూపలేదని, ఇప్పటికీ తమ ముఖ్యమంత్రి క్రియాశీలకంగానే పనిచేస్తున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కీలక సన్నిహితులు చెప్తున్నారు. మంగళవారం ప్రకాశ్ సింగ్ బాదల్ 88వ పడిలోకి అడుగుపెడుతున్నారు. పంజాబ్ లోని అబుల్ ఖురానా అనే గ్రామంలో డిసెంబర్ 8, 1927లో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ప్రకాశ్ సింగ్ బాదల్.. 1957లో పంజాబ్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున బరిలో దిగి విజయం సాధించారు. అప్పటి నుంచి భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూనే ఉన్నారు.

భారత రాజకీయాల్లోనే అత్యంత కురువృద్ధుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచారు. ఇప్పుడు ఐదోసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 1977లో ఓసారి కేంద్రమంత్రిగా కూడా బాదల్ పనిచేశారు. ఆయన భార్య సురీందర్ కౌర్ 2011లో క్యాన్సర్ కారణంగా కన్నుమూసింది. మంగళవారం ఆయన 88 ఏళ్లలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆయన కీలక అనుచరులు కొన్ని అంశాలు పంచుకున్నారు. 'బాదల్ సాబ్ పై వయోభారం పడినా ఆయన ఏమాత్రం అలసిపోలేదు. రాజకీయాల నుంచి విరమణ పొందాలన్న ఆలోచన కూడా ఆయనకు లేదు.  ఇప్పటికీ చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

ప్రతిరోజు అధికారులతో మంత్రులతో, పలువురు ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్న యువకులందరికంటే కూడా బాదల్ ఎక్కువగా పనిచేస్తున్నారు. ఆయన తన వయసును గెలిచారు. నిజమైన ప్రజానాయకుడు' అంటూ తమ ముఖ్యమంత్రిని కొనియాడారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధినేత అయిన బాదల్ ప్రస్తుతం పార్టీ చీఫ్ బాధ్యతలు కుమారుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ కు అప్పగించడంతోపాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా ఇచ్చారు. అయితే, తండ్రికి తగిన స్థాయిలో అతడు రాణించలేకపోతుండటంతో భవిష్యత్తులో ఆ పార్టీకి కష్టాలు తప్పేలా లేవని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు