సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నినాదం ఇదే..

3 Feb, 2019 16:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పనిచేసే వారి నుంచే ఫలితం ఆశిస్తారనే నినాదంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల బరిలో దిగనుంది. ఐదేళ్ల పదవీ కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఇదే నినాదంతో జనంలోకి విస్తృతంగా వెళ్లాలని ఆ పార్టీ యోచిస్తోంది. మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనలో దేశవ్యాప్తంగా దాదాపు పది కోట్ల మంది ప్రజల సలహాలను స్వీకరించేలా నెలరోజుల పాటు భారత్‌ కీ మన్‌కీ బాత్‌..మోదీ కే సాథ్‌ పేరుతో భారీ కార్యక్రమం చేపట్టింది.

ప్రజల భాగస్వామ్యంతో సంకల్ప్‌ పత్రాన్ని (ఎన్నికల ప్రణాళిక) వెల్లడించేందుకు సంసిద్ధమైంది. నూతన నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచార నినాదం సబ్‌కా సాథ్‌..సబ్‌కా వికాస్‌ నినాదాన్ని ఆ పార్టీ పక్కనపెట్టినట్లయింది. కాగా, ప్రజల భాగస్వామ్యంతో మేనిఫెస్టో రూపకల్పన ప్రజాస్వామ్యానికి మరింత మేలు చేకూరుస్తుందని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 4000 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 300కు పైగా వాహనాల్లో బాక్సులు ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయం సేకరించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోకు ఈ స్ధాయిలో ఇంతకు ముందెన్నడూ ఏ రాజకీయ పార్టీ కసరత్తు చేయలేదని పార్టీ మేనిఫెస్టో కమిటీ చీఫ్‌, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా