చేతులు లేకపోతేనేం....

21 Jul, 2017 19:30 IST|Sakshi
చేతులు లేకపోతేనేం....

చండీగఢ్‌: చేతులు లేనివారు కాళ్లతోని ఇంటి పనులు, వంట పనులు చేసుకోవడం, కాళ్లతోనే పరీక్షలు రాయడం, కాళ్లతోని బొమ్మలు గీయడం లాంటివి మనం అప్పుడప్పుడు పత్రికల్లో చూస్తుంటాం. కానీ హర్యానాలోని మదన్‌లాల్‌ అనే 45 ఏళ్ల వ్యక్తి కాళ్లతోని టైలరింగ్‌  చేయడం ఎక్కడా చూసి ఉండం. బట్టల కొలతలు తీసుకోవడం, వాటిని పొందికగా కావాల్సిన తీరులో కత్తిరించడం, కుట్టు చెదరకుండా వాటిని కుట్టడం చేతులున్న వారికే కష్టమైన పని. ఈ మూడు పనులను అతి నైపుణ్యంతో చేస్తూ గ్రామ ప్రజల మనసులను, మన్ననలను దోచుకుంటున్నారు మదన్‌లాల్‌.

ఆయన రెండు చేతుల్లేకుండానే పుట్టారు. ఏ బడికెళ్లిన దివ్యాంగుడివి, చదువు నేర్చుకోవడం రాదంటూ తిప్పి పంపించారట. దివ్యాంగులను కూడా చేర్చుకునే పట్నం బడులకు వెళ్లేంత స్థోమత ఆయన కుటుంబానికి లేకపోవడం వల్ల ఇక చదువుకోవలనే ఆశను చంపుకున్నారు. నానమ్మ, తాతయ్యలకు చేదోడు, వాదోడుగా ఇంట్లో పనులు చేస్తూ వచ్చారు. 23 ఏళ్ల ప్రాయంలో ఏదైనా వృత్తిలో స్థిరపడి సంపాదించాలనుకున్నారు. అందుకు టైలరింగ్‌ నేర్చుకోవాలనుకున్నారు. ఊరు, వాడా తిరిగారు. టైలరింగ్‌ నేర్పేందుకు ఎవరూ ఒప్పుకోలేదు. పైగా గేలిచేసి పంపించారు. చివరకు పొరుగునున్న ఫతేహబాద్‌కు వెళ్లారు.

ఎంతో నచ్చచెప్పగా అక్కడ ఓ టైలర్‌ శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆయన వద్ద టైలరింగ్‌ నేర్చుకొని కొంతకాలం అక్కడే గడిపిన మదన్‌లాల్‌ చివరకు తన ఊరుకు వచ్చి ఓ టైలరింగ్‌ షాపు పెట్టుకున్నారు. వచ్చేవారికి, పోయే వారికి తన నైపుణ్యం గురించి చెబుతూ వచ్చారు. మొదట ఎవరూ నమ్మలేదు. ఆయన వద్ద బట్టలు కుట్టించుకునేందుకు ధైర్యం చేయలేదు.

తాను ఎలా కుడతానో ప్రాక్టికల్‌గా కుట్టి చూపించగా అప్పటి నుంచి గిరాకీ రావడం మొదలైంది. ఇప్పుడు ఆయన టైలరింగ్‌ షాపు సంతప్తికరంగా నడుస్తోంది. మదన్‌లాల్‌ తన వంట తానే చేసుకోవడంతోపాటు తీరక వేళల్లో కాళ్లతోనే చీట్ల పేక ఆడతారు. ఆత్మవిశ్వాసం, అందుకుతగ్గ కషి ఉండాలిగానీ అనుకున్నది దేన్నైనా సాధించవచ్చని మదన్‌లాల్‌ తన అనుభవపూర్వకంగా చెబుతున్నారు.

మరిన్ని వార్తలు