‘మద్యానికి చరమగీతం పాడుదాం’ | Sakshi
Sakshi News home page

‘మద్యానికి చరమగీతం పాడుదాం’

Published Fri, Jul 21 2017 7:18 PM

‘మద్యానికి చరమగీతం పాడుదాం’ - Sakshi

హైదరాబాద్‌: మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమాజాన్ని నాశనం చేస్తోందని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కో-చైర్‌పర్సన్‌ అరుణోదయ విమలక్క, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి బత్తుల హైమావతి అన్నారు. మహిళలు అందరూ ముందుకొచ్చి మద్యానికి చరమ గీతం పాడాలని వారు పిలుపునిచ్చారు.  బోడుప్పల్‌ ఎస్‌బీఆర్‌ కాలనీలో అమృత బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయొద్దంటూ మహిళలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరాయి. దీక్షలో పాల్గొన్న వారికి విమలక్క, హైమావతి సంఘీభావం  ప్రకటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం మద్యం నుంచి వస్తోందని, ఆదాయం  కోసమని ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రజలను వ్యసనాలకు బానిసలను చేస్తోందన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా మద్యం అమ్మకాలకు అనుమతులిస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక నగరంలో పబ్‌లకు అనుమతులు ఇచ్చి 14 ఏళ్ల బాలికలతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తోందన్నారు. మద్య నిషేధం కోసం ముందుకొచ్చే వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విమలక్క పాటలు పాడి మహిళలను ఉత్తేజపరిచారు. 
 

Advertisement
Advertisement