శారద స్కామ్‌లో నళినీ చిదంబరానికి ఊరట

18 Feb, 2019 16:42 IST|Sakshi

కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో మాజీ కేం‍ద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం భార్య నళినీ చిదంబరానికి కలకత్తా హైకోర్టు సోమవారం మధ్యంతర ఊరట కల్పించింది. ఈ కేసుకు సంబంధించి ఆమెను అరెస్ట్‌ చేయరాదని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకూ నళినీ చిదంబరంను అరెస్ట్‌ చేయకుండా దర్యాప్తు ఏజెన్సీను నిరోధించింది.

దర్యాప్తునకు సహకరించాలని నళినీ చిదంబరంను ఆదేశించిన కోర్టు ముందస్తు బెయిల్‌ దరఖాస్తును పెండింగ్‌లో ఉంచుతూ జస్టిస్‌ జోమాల్య బాగ్చి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోగా తమ వాదనలకు మద్దతుగా నళినీ చిదంబరం, సీబీఐ అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది. ఇన్వెస్టర్ల నుంచి శారదా చిట్‌ ఫండ్‌ సంస్థ అక్రమంగా సేకరించిన సొమ్ము నుంచి సీనియర్‌ న్యాయవాది నళినీ చిదంబరానికి రూ 1.3 కోట్లు చెల్లించారని సీబీఐ ఆరోపిస్తోంది. అయితే మనోరంజన సింగ్‌కు న్యాయసలహాదారుగా ఆమెకు ఆ మొత్తం చెల్లించారని నళినీ చిదంబరం న్యాయవాది ఘోష్‌ న్యాయస్ధానానికి నివేదించారు.

మరిన్ని వార్తలు