ఉద్యోగుల పిల్లలకూ రిజర్వేషన్లా?

24 Aug, 2018 03:52 IST|Sakshi

ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో కోటాపై సుప్రీంకోర్టు ప్రశ్న

న్యూఢిల్లీ: ఉన్నతోద్యోగాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీల పిల్లలు, కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం వెనక హేతుబద్ధత ఏంటని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. క్రీమీలేయర్‌ను ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు వర్తింపజేయరని నిలదీసింది. ‘ పదోన్నతుల్లో రిజర్వేషన్ల వల్ల ఫలానా వ్యక్తి ఓ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాడునుకోండి. ఆయన కుటుంబ సభ్యులను దళితులుగా భావించి వారికీ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం సహేతుకమేనా? దాని వల్ల వారి సీనియారిటీ సైతం త్వరగా పెరుగుతుందిగా’ అని కోర్టు సందేహం వ్యక్తం చేసింది.

గురువారం రోజంతా జరిగిన విచారణకు హాజరైన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, పలువురు సీనియర్‌ లాయర్లు పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా అమలును సమర్థించారు. ఈ రిజర్వేషన్లు దాదాపుగా నిలిచిపోవడానికి కారణమైన 2006 నాటి ఎం.నాగరాజ్‌ కేసు తీర్పును సమీక్షించాలని కోరారు. కానీ, సీనియర్‌ లాయర్‌ శాంతిభూషణ్, మరో సీనియర్‌ లాయర్‌ రాజీవ్‌ ధావన్‌ ఈ కోటాను వ్యతిరేకించారు. రిజర్వేషన్ల వల్ల ఉద్యోగ అవకాశాల్లో సమానత్వపు హక్కు ఉల్లంఘనకు గురవుతోందని ఆరోపించారు. ‘ఒక వ్యక్తి క్లాస్‌–1 అధికారి అయితే, ఇక అతను ఎంతమాత్రం వెనకబడిన తరగతికి చెందడు. కానీ రాజకీయ పార్టీలు దళితులను ఓటుబ్యాంకుగానే పరిగణిస్తున్నాయి’ అని శాంతి భూషణ్‌ అన్నారు. త్రిపుర, బిహార్, మధ్యప్రదేశ్‌ లాయర్లు కోటాకు మద్దతుగా వాదించారు. 

>
మరిన్ని వార్తలు