యూరియా స్కాంలో 100 కోట్ల జరిమానా!

13 Jul, 2018 02:51 IST|Sakshi

సీబీఐ కోర్టు తీర్పు

ఇద్దరు టర్కీ దేశస్తులు, పీవీ బంధువు సహా 8 మందికి శిక్షలు

న్యూఢిల్లీ: 23 ఏళ్లనాటి రూ.133 కోట్ల యూరియా కుంభకోణంలో తీస్‌ హజారీ ప్రత్యేక సీబీఐ కోర్టు దోషులకు భారీ జరిమానాతోపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇద్దరు టర్కీ దేశస్తులకు ఆరేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బంధువు, మాజీ కేంద్ర మంత్రి తనయుడు సహా ఈ కేసుతో సంబంధమున్న భారతీయులకు భారీ జరిమానా విధించింది.

టర్కీ దేశస్తులు టుంకే అలంకుస్, సిహాన్‌ కరాంచీ (వీరిద్దరూ కర్సాన్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు)లతోపాటు ఆ కంపెనీ భారతీయ ప్రతినిధి ఎం సాంబశివరావు, నేషనల్‌ ఫెర్టిలైజర్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) మాజీ సీఎండీ రామకృష్ణన్, ఎన్‌ఎఫ్‌ఎల్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దిల్‌బాగ్‌ సింగ్‌ కన్వర్, మల్లేశం గౌడ్, మాజీ కేంద్ర మంత్రి రామ్‌లఖన్‌ సింగ్‌ యాదవ్‌ కుమారుడు ప్రకాశ్‌ చంద్ర, మాజీ ప్రధాని పీవీ బంధువు సంజీవ రావు ఈ కేసులో దోషులుగా ఉన్నారు. రామకృష్ణ, కన్వర్‌లకు మూడేళ్ల జైలు, రూ.6లక్షల జరిమానా, సాంబశివరావుకు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, మల్లేశం గౌడ్‌కు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, సంజీవరావ్, యాదవ్‌లకు కోటి రూపాయల జరిమానా మూడేళ్ల జైలు శిక్ష విధించారు.

కుంభకోణం కేసేంటి?
ఈ కేసులో పేర్కొన్న వారంతా నేరపూరిత కుట్రతో ఎన్‌ఎఫ్‌ఎల్‌ను రూ.133 కోట్ల మేర మోసం చేశారంటూ 1996, మే 19న సీబీఐ కేసు నమోదు చేసింది. ‘టర్కీ దేశస్తుడైన అలంకుస్‌ ఎన్‌ఎఫ్‌ఎల్‌కు యూరియా సరఫరా చేసేందుకు కర్సాన్‌ లిమిటెడ్‌ కంపెనీ తరపున ఒప్పందం చేసుకున్నాడు. మెట్రిక్‌ టన్నుకు 190 డాలర్ల చొప్పున 2లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరాకోసం ముందుగానే 100% చెల్లించాలని ఒప్పందంలో ఉంది. దీని విలువ దాదాపుగా రూ.133 కోట్లు. నవంబర్‌ 2, 1995న అలంకుస్‌కు 3.8లక్షల డాలర్లు బీమా అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన 3.76 కోట్ల డాలర్లను కర్సాన్‌ కంపెనీ అకౌంట్లోకి  1995లో జమచేశారు. అయితే ఈ కంపెనీ ఎన్‌ఎఫ్‌ఎల్‌కు యూరియాను పంపలేదు.

కుంభకోణం నేపథ్యం..
1995,సెప్టెంబర్‌: యూరియా సరఫరాకు అంతర్జాతీయ టెండర్ల ఆహ్వానం
1996 మార్చి: టర్కీ కంపెనీ కార్సాన్‌కు రూ.133 కోట్ల చెల్లింపు
1996 మే: యూరియా సరఫరా చేయకపోవడంపై సీబీఐ విచారణకు ఆదేశం
1996 ఆగస్టు: కంభకోణంలో వెలుగులోకి   పీవీ కొడుకు ప్రభాకర్‌ రావు పేరు
1998 నవంబర్‌: ప్రభాకర్‌ రావు అరెస్టు  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు