ఫోన్‌ట్యాపింగ్‌ దుమారం: రంగంలోకి సీబీఐ

26 Sep, 2019 11:33 IST|Sakshi

బెంగళూరు: బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్‌ అలోక్‌ కుమార్‌ ఇంట్లో సీబీఐ అధికారులు గురువారం దాడులు నిర్వహిస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో భాగంగా ఆయన నివాసంలో సీబీఐ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అలోక్‌ కుమార్‌ ప్రస్తుతం కర్ణాటక స్టేట్‌ రిజర్వు పోలీసు అదనపు డీజీపీగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుమారస్వామి ప్రభుత్వం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొని.. అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించారు.

ఈ రాజకీయ సంక్షోభ సమయంలో అప్పటి సీఎం కుమారస్వామి తమ ఫోన్లను ట్యాప్‌ చేశారని పలువురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి ఓ ఫోన్‌ సంభాషణ క్లిప్‌ మీడియాకు లీక్‌ కావడంతో ఇది తీవ్ర దుమారం రేపింది. ఈ ఆడియో క్లిప్‌లో ఓ ఐపీఎస్‌ అధికారి పేరుతోపాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ తదితరులు పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ.. విచారణను చేపట్టింది. గత కుమారస్వామి ప్రభుత్వం తనతోపాటు మరో 300 మంది నాయకుల ఫోన్లను ట్యాప్‌ చేసిందని అన్హరత వేటుకు గురైన జేడీఎస్‌ ఎమ్మెల్యే ఏహెచ్‌ విశ్వనాథ్‌ ఆరోపించడం సంచలనం రేపింది. కాంగ్రెస్‌ నేతలు కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కోరుతుండగా.. దీని వెనుక ఉన్నది కుమారస్వామియేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు