చాయ్‌వాలాకు ‘పద్మశ్రీ’

27 Jan, 2019 17:09 IST|Sakshi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో దేవరపల్లి ప్రకాశరావు

దేవరపల్లి ప్రకాశరావుకు అరుదైన పురస్కారం

కాకినాడ నుంచి ఒడిశాకు వలస

విద్యాదానం, సంఘసేవే నిత్యశ్వాస

17సార్లు ప్లేట్‌లెట్స్, 210 సార్లు రక్తాదానం, అవయవదానానికి అంగీకారపత్రం

ప్రధాని మన్‌కీబాత్‌లో ప్రశంసలు

భువనేశ్వర్‌: పెద్దల అదుపాజ్ఞలు లేక కుంటుపడిన తన విద్యాభ్యాసంలా.. నేటి తరం బాలలు విద్యకు దూరం కాకూడదనే ‘పెద్ద మనసు’ ఆయనను సంఘ సేవలోకి అడుగిడేలా చేసింది.. పసి హృదయాల్లో ప్రాథమిక విద్యాభ్యాసంపై మక్కువ పెంపొందించి విద్యార్జనకు పునాది వేసే ‘ఆశా ఓ ఆశ్వాసన్‌’ సంస్థను స్థాపించేలా ప్రేరేపించింది. స్వీయ జీవితంలోని తప్పిదాలు భావితరాలకు పునరావృతం కాకూడదనే సదభిప్రాయమే ఆయనకు మన దేశపు ప్రతిష్టాత్మక పురస్కారం ‘పద్మశ్రీ’ తెచ్చిపెట్టింది. ఆయనే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి వలస వచ్చి కటక్‌ మహానగరంలోని బక్షిబజార్‌ (మురికివాడ)లో స్థిరపడిన దేవరపల్లి ప్రకాశరావు. ఆయన వయసిప్పుడు 59 సంవత్సరాలు. తాత, ముత్తాతల కాలం నుంచి అదే ప్రాంతంలో స్థిరపడ్డారు.

అర్ధాంతరంగా ఆయన చదువు అటకెక్కడంతో.. తండ్రి పెట్టిన టీ కొట్టునే జీవనాధారం చేసుకున్నారు. తనలా మరెవరూ విద్యకు దూరం కాకూడదనే సత్సంకల్పంతో తనకున్న రెండు గదుల ఇంటిలోనే ఓ గదిని చిన్న స్కూల్‌గా మార్చేశారు. ఇప్పుడు ఆ స్కూల్‌లో సుమారు 80 మంది విద్యనభ్యసిస్తున్నారు. విద్యాదానమే కాదు... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ ప్రకాశరావుది పెద్ద చెయ్యే. ఒకానొక సందర్భంలో తనకు రక్తదానం చేసి.. ప్రాణాలు కాపాడిన ఓ అపరిచిత వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకున్న ఆయన.. 1976 నుంచి ఇప్పటి వరకు 210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్‌లెట్స్‌ దానం చేశారు.

ప్రతి రోజూ ప్రభుత్వాస్పుత్రిలోని పేద రోగులకు పాలు, బిస్కెట్లు, పండ్లు దానం చేస్తుంటారు. విద్యాధికుడు కాకున్నా జీవన స్రవంతిలో దైనందిన మనుగడ కోసం ఆయన 8 భాషల్లో మాటామంతీ చేయగల సమర్థుడు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం తరహాలోనే చదువుపై బాలల్లో మక్కువ పెంపొందించేందుకు పాలు, బిస్కెట్లు, బన్‌ వంటి తినుబండారాలు నిత్యం ఉచితంగా ఇస్తూ ఆదరిస్తున్నారు. పిల్లలకు యూనిఫాం, చెప్పులు కూడా ఉచితంగా ఇస్తారు. ప్రస్తుతం 4 నుంచి 9 ఏళ్ల లోపు సుమారు 80 మంది బాలలు ఆయన ఆధ్వర్యంలో అక్షరాలు నేర్చుకుంటున్నారు. చిట్ట చివరగా ఆయన మరణానంతరం కూడా మానవాళి మనుగడకు ఎంతో కొంత దోహదపడాలనే తపనతో అవయవ దానం చేసేందుకు ఇప్పటికే అంగీకార పత్రం ఇచ్చారు. ఆయన ఆర్జించిన దానిలో సింహ భాగం సంఘసేవకే వెచ్చిస్తుంటారు. కాగా నిజ జీవితంలో ఎదురైన కష్ట నష్టాలు తోటి వారిలో తిరిగి చూడరాదనే భావమే సంఘ సేవకు ప్రేరేపించి నేడు తనను ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీతగా నిలిపిందని ‘సాక్షి’తో దేవరపల్లి ప్రకాశరావు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు
ప్రకాశరావు సంఘసేవ గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాది మే నెలలో ఒడిశా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా దేవరపల్లి ప్రకాశరావుతో భేటీ అయ్యారు. ఆయన నిర్వహిస్తున్న సంస్థను సందర్శించి ముచ్చటపడ్డారు. ఆయన సేవలు అనన్యమని అభినందించారు. అనంతరం మన్‌ కీ బాత్‌ ప్రసార కార్యక్రమంలో మాట్లాడుతూ..  ప్రకాశరావు సంఘసేవలో తలమునకలై నిరంతరం కొనసాగించడం అభినందనీయమని.. ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించడం విశేషం. ప్రకాశరావును పద్మశ్రీ వరించినందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆయనకు అభినందనలు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు