ఈబీసీ రిజర్వేషన్లపై పిల్‌ ఎందుకు?

11 Jan, 2019 16:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది ఎవరు ? ఎందుకు ? వారి ఉద్దేశం ఏమిటీ? పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి అనుబంధ విద్యార్థి సంఘమైన అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)కి ఢిల్లీ యూనివర్శిటీ ఎన్నికల్లో ప్రతి ఏటా మద్దతిస్తున్న ‘యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ’ సంఘం ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేయడం గమనార్హం. ఉన్నత చదువుల్లో కూడా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ 2006–07లో జరిగిన ఆందోళన నుంచి ఈ సంఘం పుట్టుకొచ్చింది. 

కులాల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం మంచిదే అయినప్పటికీ రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదన్న సుప్రీం కోర్టు ఆంక్షలు ఉల్లంఘిస్తున్న కారణంగా ఈ రిజర్వేషన్ల వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం, ఓబీసీలకు 27 శాతం కలిపి మొత్తం 49. 5 శాతం రిజర్వేషన్లు ఇప్పటికే ఉన్న విషయం తెల్సిందే. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే 27 శాతం ఉన్న ఓబీసీ రిజర్వేషన్లలోనే వీరికి రిజర్వేషన్లు కల్పించాలన్నది ‘యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ’ వాదన. అంటే ఓబీసీ రిజర్వేషన్లను 17 శాతానికి కుదించడం సంఘం ఉద్దేశం. ఈ రిజర్వేషన్లు ఎన్నికల సమయంలో తీసుకరావడం అంటే రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది పాలకపక్ష బీజేపీ ఆలోచన అని కూడా సంఘం విమర్శించింది. 

ఉన్నత వైద్య, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో భాగంగా ‘యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ’ సంఘం పుట్టుకరాగా ఏయిమ్స్‌లో ఆర్థోపేడిక్‌ సర్జన్‌గా పనిచేస్తున్న కౌశల్‌ కాంత్‌ మిశ్రా అధ్యక్షతన ఇది ఏర్పాటయింది. ఆయన అంతకుముందు కాన్పూర్‌ విద్యార్థిగా ఉన్నప్పుడే 1993లో కులాల ప్రాతిపదిక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీశారు. 

>
మరిన్ని వార్తలు