అజిత్‌ జోగి కన్నుమూత

30 May, 2020 05:05 IST|Sakshi
అజిత్‌ జోగి

గుండెపోటుకు గురై తుదిశ్వాస

స్వస్థలం గౌరెలాలో ఆదివారం అంత్యక్రియలు

రాయ్‌పూర్‌/న్యూఢిల్లీ:  ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ అజిత్‌ జోగి(74) రాయ్‌పూర్‌లోని శ్రీనారాయణ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 20 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి కోమాలోనే ఉన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. అజిత్‌ జోగి భార్య రేణు ప్రస్తుతం కోట నియోజకవర్గ ఎమ్మెల్యే. అజిత్‌ జోగి మరణం నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌ ప్రకటించారు. జోగి అంత్యక్రియలను ఆయన స్వస్థలం మర్వాహీ జిల్లాలోని గౌరెలాలో ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపారు.  

విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ  
అజిత్‌ జోగి మృతి చెందడం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ప్రధానంగా గిరిజనుల జీవితాలను మార్చేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు.

పేదల ‘కలెక్టర్‌ సాబ్‌’
ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు ‘కలెక్టర్‌ సాహెబ్‌’అని ముద్దుగా పిలుచుకునే అజిత్‌ జోగి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి తొట్టతొలి ముఖ్యమంత్రి. 2000 నవంబర్‌ నుంచి డిసెంబర్‌ 2003 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. విద్యావంతుడు, రచయిత, రాజకీయవేత్త అయిన అజిత్‌ జోగి పూర్తి పేరు అజిత్‌ ప్రమోద్‌ కుమార్‌ జోగి. ఆదివాసీ సమాజంలో పుట్టి ఉన్నత చదువులు చదివి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన నేత. 1946 ఏప్రిల్‌ 29వ తేదీన అప్పటి మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భిలాస్‌పూర్‌ జిల్లాలోని జోగిసర్‌లో జన్మించారు. ఆయన తండ్రి కాశీ ప్రసాద్‌ జోగి, తల్లి కాంతిమణి.  

విద్యార్థి నాయకుడి నుంచి..
అత్యధికంగా పన్నెండేళ్లపాటు నాలుగు జిల్లాలకు కలెక్టరుగా వ్యవహరించిన జాతీయ రికార్డు అజిత్‌ జోగి సొంతం. విద్యార్థి జీవితం నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. భోపాల్‌లోని మౌలానా ఆజాద్‌ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీకి 1967లో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివారు. 1967లో రాయ్‌పూర్‌లోని గవర్నమెంట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో లెక్చరర్‌గా కూడా పనిచేశారు. రాజకీయ రంగ ప్రవేశం చేసి, అంచెలంచెలుగా జాతీయస్థాయి నేతగా ఎదిగారు. అజిత్‌ శాసనసభతోపాటు లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికయ్యారు.

2016లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్‌ అజిత్‌ జోగిని పార్టీ నుంచి బహిష్కరించింది. అదే ఏడాది అజిత్‌ జోగి ఛత్తీస్‌గఢ్‌ జనతా కాంగ్రెస్‌ పేరుతో పార్టీని ప్రారంభించారు. అజిత్‌ జోగి రాజకీయవేత్త మాత్రమే కాదు రచయితగా కూడా సుపరిచితులు. ‘‘ద రోల్‌ ఆఫ్‌ డిస్ట్రిక్ట్‌ కలెక్టర్‌’’, ‘‘అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ పెరిఫెరల్‌ ఏరియాస్‌’’అనే పుస్తకాలు రాశారు. 2004లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అజిత్‌ జోగి వీల్‌ఛైర్‌కు పరిమితమయ్యారు. అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. జోగి భార్య రేణు, కొడుకు అమిత్‌  రాజకీయాల్లో ఉన్నారు.

ప్రభుత్వ అధికారిగా...
1968లో సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా ఐఏఎస్‌కి ఎంపికయ్యారు. కలెక్టర్‌గా పనిచేసిన నాలుగు జిల్లాల్లోనూ అధికార దర్పాన్ని పక్కనపెట్టి పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ఆయన ఇంట్లోకి సైతం ప్రజలకు నేరుగా ప్రవేశించే స్వేచ్ఛనిచ్చిన అరుదైన కలెక్టర్‌ సాహెబ్‌ అజిత్‌ జోగి. కలెక్టర్‌ పదవికి రాజీనామా చేసిన అనంతరం జాతీయ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు.

మరిన్ని వార్తలు