అశ్లీల సీడీలపై సీబీఐ విచారణకు సిఫార్స్‌ 

29 Oct, 2017 11:27 IST|Sakshi

సాక్షి,రాయ్‌పూర్‌: రాష్ట్ర మంత్రిపై ఆరోపణలు వచ్చిన అశ్లీల సీడీ వివాదంపై సీబీఐ విచారణకు చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూ మం‍త్రి ప్రేమ్‌ ప్రకాష్‌ పాండే వెల్లడించారు. ఈ వీడియో వివాదంపై చర్చించిన అనంతరం సీబీఐ విచారణకు రికమెండ్‌ చేసినట్టు మంత్రి తెలిపారు. నకిలీ సీడీ ద్వారా మంత్రిని ఇరికించేందుకు కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని ఆరోపించారు. సీడీని ట్యాంపరింగ్‌ చేశారని స్థానిక టీవీ ఛానెల్‌ తన నివేదికలో స్పష్టం చేసిందని చెప్పారు. ఈ అంశం రాజకీయంగా సున్నితమైనది కావడం, నేరపూరిత కుట్రలో భాగంగా ఉండటంతో సీబీఐచే దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు.

సీబీఐ విచారణకు సహకరించేలా ఆరోపణలు ఎదుర్కొంటున్న మం‍త్రి రాజేష్‌ మునోత్‌ పదవి నుంచి వైదొలుగుతారా అని ప్రశ్నించగా రాష్ట్ర మం‍త్రి సీబీఐ విచారణను ఎలా ప్రభావితం చేయగలరని ప్రశ్నించారు. సెక్స్‌ సీడీకి సంబంధించి సీనియర్‌ జర్నలిస్ట్‌ వినోద్‌ వర్మను చత్తీస్‌ఘడ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. వర్మ నివాసంలో 500 అశ్లీల సీడీలు, రూ 2 లక్షల నగదు, ఓ పెన్‌డ్రైవ్‌, డైరీని స్వాధీనం చేసుకున్నామని రాయ్‌పూర్‌ ఎస్‌పీ సంజీవ్‌ శుక్లా చెప్పారు. అశ్లీల సీడీల వ్యవహారం బీజేపీ, కాం‍గ్రెస్‌ల మధ్య పెను వివాదం సృష్టించడంతో చత్తీస్‌ఘడ్‌లో రాజకీయ దుమారం చెలరేగింది.

మరిన్ని వార్తలు