ఐఎన్‌ఎక్స్‌ కేసు : చిదంబరాన్ని అరెస్ట్‌ చేసిన ఈడీ

16 Oct, 2019 12:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో బుధవారం ఉదయం నుంచి తిహార్‌ జైలులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరంను ప్రశ్నించిన ముగ్గురు సభ్యులతో కూడిన ఈడీ బృందం ఆయనను అరెస్ట్‌ చేసింది. కస్టడీలో చిదంబరంను ప్రశ్నించేందుకు ప్రత్యేక న్యాయస్ధానం అనుమతించిన మరుసటి రోజే ఆయనను ఈడీ అదుపులోకి తీసుకుంది. మనీల్యాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 74 సంవత్సరాల చిదంబరం సెప్టెంబర్‌ 5 నుంచి తిహార్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

మరోవైపు చిదంబరంను కస్టడీ కోరుతూ ఈడీ అధికారులు మరికాసేపట్లో సీబీఐ కోర్టును ఆశ్రయించనున్నారు. కాగా చిదంబరంను కలిసేందుకు ఆయన భార్య నళిని, కుమారుడు కార్తీ చిదంబరం ఈరోజు ఉదయం తిహార్‌ జైలును సందర్శించారు. తన తండ్రి ఎన్ని ఇబ్బందులు ఎదురైన సానుకూల స్ఫూర్తితో ఉన్నారని, రాజకీయ జిమ్మిక్కులతో సాగుతున్న ఈ తంతును ఆయన ఎదుర్కొంటారని కార్తీ చిదంబరం పేర్కొన్నారు. ఇది బోగస్‌ విచారణ అని కార్తీ తన తండ్రిని కలిసిన అనంతరం వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు