ఆ పిల్లల ప్రాణాలు అరచేతుల్లో..

1 Oct, 2018 16:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అస్సాంలోని విశ్వనాథ్‌ జిల్లా, సూటియా అనే కుగ్రామంలో ప్రాథమిక పాఠశాల పిల్లలు ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బడికి వెళుతున్నారు. మోయలేక మోస్తున్న పుస్తకాల బరువు అందుకు కారణం కాదు. వారంతా బడికి వెళ్లాలంటే ఎప్పుడూ ప్రవహించే ఓ నదిని దాటాలి. దానిపై వంతెనా లేదు. ప్రయాణికులను దాటించే పడవులూ లేవు. అందుకని పిల్లలంతా పెద్ద రాతెండి జబ్బ తట్టలను ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. అందులో కూర్చొని నీటి వాలున చేతులతో వాటిని నడిపిస్తూ ఆవలి ఒడ్డుకు వెళుతున్నారు. వస్తున్నారు.

పుట్టీలు మునిగినట్లు ఆ రాతెండి తట్టలు పల్టీకొడితే పిల్లల ప్రాణాలు నీటిలో కలసిపోయే ప్రమాదం ఉంది. ఇదివరకు పిల్లలు అరటి బోదెలతోని చిన్న పడవల్లా చేసుకొని వచ్చేవారని, అవి త్వరగా పాడవడం, విరివిగా దొరక్కపోవడం వల్ల ఇప్పుడు వెడల్పుగా ఉండే జబ్బ తట్టలను ఉపయోగిస్తున్నారని అదే పాఠశాలలో పనిచేస్తున్న జే. దాస్‌ అనే ఉపాధ్యాయుడు తెలిపారు. పాఠశాల పిల్లలు నది దాటటంలో పడుతున్న పాట్లను ఏఎన్‌ఐ అనే వార్తా సంస్థ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా ఇప్పడది వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోను చూసిన స్థానిక బీజేపీ శాసనసభ్యుడు ప్రమోద్‌ బోర్తాకుర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం పీడబ్ల్యూ రోడ్డు కూడా లేకుండా దీవిలా ఉన్న చోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎందుకు నిర్మించారో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను వెంటన జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళతానని, విద్యార్థుల కోసం పడవ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు