‘ఆ తెగ ప్రజలు ఒక్కసారి చేసిన తప్పు మళ్లీ చేయరు’

24 Nov, 2018 13:14 IST|Sakshi

పోర్ట్‌ బ్లేయర్‌ ​: మొత్తం జనాభ 500 మించి ఉండరు.. అది కూడా జనావాసాలకు దూరంగా ఎక్కడో అజ్ఞాతంగా ఉంటారు. వారిని దగ్గరగా చూడడం అంటే చావును ప్రత్యక్షంగా చూడటమే.. వారే అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో ఉన్న సెంటినెలీస్‌ తెగ ప్రజలు. ఇన్ని రోజులు బయట ప్రంపంచానికి పెద్దగా తెలియని వీరి గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోని సెంటినెలీస్‌ తెగ ప్రజల చేతిలో జాన్‌ అలెన్‌ చౌ అనే అమెరికన్‌ టూరిస్ట్‌ దారుణ హత్యకు గురి కావడంతో వీరి గురించి వెలుగులోకి వచ్చింది. బయటి వారి ఉనికినే ఇష్టపడని ఈ ప్రజలను కలవాలనుకోవడం.. జీవితం మీద ఆశలు వదులుకోవడం లాంటిదే అంటున్నారు కమాండెంట్‌ ప్రవీణ్‌ గౌర్‌. 2006లో ఓ రెస్య్కూ ఆపరేషన్‌లో భాగంగా సెంటినెలీస్‌ ప్రజలను దగ్గరగా చూసిన ప్రవీణ్‌ తన అనుభావాల గురించి ఎన్డీటీవీతో ముచ్చటించారు.


సెంటినెలీస్‌ తెగ ప్రజల చేతిలో హత్యకు గురైన అమెరికన్‌ టూరిస్ట్‌ జాన్‌ అలెన్‌ చౌ (ఫైల్‌ ఫోటో)

ఆ వివరాలు.. 2006లో పోర్టు బ్లేయర్‌ సమీపంలోని గ్రామానికి చెందిన ఇద్దరు జాలరులు సముద్రంలో చేపలు పట్టడానికి మోటారు బోటులో వెళ్లారు. తిరిగి రాలేదు. గల్లంతయిన వీరిని వెదికే బాధ్యతను ప్రభుత్వం నాకు అప్పగించింది. దాంతో నేను మరికొంత మంది సిబ్బందితో కలిసి ఒక చాపర్‌లో సెంటినెల్‌ ద్వీపానికి వెళ్లాము. ఒక చోట మాకు పడవ కనిపించింది. దాని దగ్గరకు వెళ్లడం కోసం ప్రయత్నించాము. అంతే ఒక్కసారిగా బాణాలు మా చాపర్‌ వైపు దూసుకురాసాగాయి. వారు దాదాపు 100 అడుగుల ఎత్తు వరకూ బాణాలు విసిరారు. వారంతా దాదాపు 50 మంది దాకా ఉంటారు. వారి ఒంటి మీద ఎర్ర వస్త్రం లాంటిదేదో ఉంది. అక్కడ ఒక్క స్త్రీ కూడా మాకు కనిపించలేదు. బోటు దగ్గరకు చేరాలంటే.. ముందు అక్కడ ఉన్న వారిని పంపించేయ్యాలి. కానీ అది సాధ్యమయ్యేలా లేదు. దాంతో నేను మా ప్లాన్‌ - ఏని అమలు చేశాను.

ప్లాన్‌ - ఏలో భాగంగా మా చాపర్‌ని కొద్ది ఎత్తులోనే పోనిచ్చాను. దాంతో వారు మమ్మల్ని అందుకోవడానికి మా చాపర్‌ని వెంబడిస్తూ వచ్చారు. అలా వారిని దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకూ తీసుకెళ్లాము. ఆ తర్వాత ప్లాన్‌ - బీని అమలు చేశాను. దానిలో భాగంగా మా చాపర్‌ని వెనక్కి.. బోటు ఉన్న ప్రదేశానికి తిప్పాను. ఈ అనుకోని పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి వారికి కాస్తా సమయం పడుతుంది. వారు అక్కడి నుంచి వచ్చేలోపు మృత దేహాలను తీసుకెళ్లాలని భావించాము. బోటు దగ్గరకు వచ్చి అక్కడ గుంతలాగా ఉన్న ప్రదేశంలో తవ్వడం ప్రారంభించాము. ఒక జాలరి మృతదేహం బయటపడింది. అతన్ని బోటులోనే ఉన్న తాడుతో ఉరి వేసి చంపారు. మరో వ్యక్తి మృత దేహాం కోసం వెతుకుతుండగా వారు తిరిగి అక్కడికి వస్తున్నట్లు అనిపించింది. దాంతో మొదట వెలికి తీసిన మృత దేహాన్ని చాపర్‌లో ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యాము. మరొక్క సెకన్‌ అక్కడే ఉంటే మేం కూడా శవాలుగా మారే వాళ్లం. చావుని అంత దగ్గరగా చూశాం.

ఆ తరువాత మరోసారి ఇంకో మృతదేహం కోసం తిరిగి అక్కడికి వెళ్లాం. మొదటి సారి అమలు చేసిన ప్లాన్‌లనే ఈ సారి కూడా అమలు చేయాలని భావించాము. ప్లాన్‌ - ఏ లో భాగంగా వారిని కొంత దూరం తీసుకెళ్లడానికి ప్రయత్నించిన మాకు ఈ సారి గట్టి షాకే తగిలిందే. మొదటిసారిలానే అందరూ మా వెనకే వస్తారని భావించిన మాకు వారి తెలివి తేటలు చూసి ఆశ్చర్యం వేసింది. మొదటి సారిలా కాకుండా ఈ సారి కొందరు బోటు దగ్గరే ఉండగా.. మరి కొందరు మా చాపర్‌ వెంట పడ్డారు. మా దగ్గర మిషన్‌ గన్‌లు ఉన్నాయి కానీ వాటిని వాడాటానికి లేదు. ఈ లోపు వారు మా చాపర్‌ మీద దాడి చేయడం ప్రారంభించారు. నాతో పాటు వచ్చిన సిబ్బందిని క్షేమంగా తీసుకురావడం నా ‍ప్రథమ కర్తవ్యం. దాంతో మృతదేహాన్ని తీసుకురావాలనే ప్లాన్‌ని ఉపసంహరించుకుని తిరుగు ప్రయాణమయ్యాం.

ఈ సంఘటనను బట్టి నాకొక విషయం బాగా అర్థమయ్యింది. సెంటనెలీస్‌ ప్రజలు ఒకసారి చేసిన తప్పునే మళ్లీ చేయరని తెలిసింది అంటూ తనకు ఎదురైన అనుభావాలను చెప్పుకొచ్చారు ప్రవీణ్‌ గౌర్‌. 2006లో భారత ప్రభుత్వం ప్రవీణ్‌ను తత్రక్షక్‌ మెడల్‌తో సత్కరించింది.

మరిన్ని వార్తలు