శరణార్థి సంక్షోభం!

1 Jan, 2017 04:53 IST|Sakshi
శరణార్థి సంక్షోభం!

కాన్‌ఫ్లిక్ట్‌ జోన్‌ జమ్మూ వర్సెస్‌ కశ్మీర్‌

జమ్మూ కశ్మీర్‌లోని బీజేపీ– పీడీపీ సంకీర్ణ  ప్రభుత్వాన్ని మరో వివాదం చుట్టుముట్టింది. దేశ విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు తరలివచ్చిన శరణార్థులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం తాజా వివాదానికి కారణం. ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని, ఇది రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని నీరుగార్చడమేనని నేషనల్‌ కాన్ఫరెన్స్, వేర్పాటువాద నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు బీజేపీ, వీహెచ్‌పీ, శ్రీరామ్‌సేన, పాంథర్స్‌ పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి.
– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

ఏమిటీ గుర్తింపు పత్రాలు?
దేశ విభజన అనంతరం, పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన వారిని శరణార్థులుగా గుర్తిస్తూ వారి పేరు, తల్లిదండ్రుల పేర్లతో పాటు ఫొటో ముద్రించి ఉన్న గుర్తింపు ధ్రువపత్రాలను ప్రభుత్వం జారీ చేస్తోంది. నైబ్‌ తహసీల్దార్‌ వీటిని జారీ చేస్తారు. అవిభాజ్య భారత్‌లో నివసిస్తున్న సదరు వ్యక్తి, దేశ విభజన అనంతరం భారత్‌కు తరలివచ్చినట్లు, ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోని పలానా ప్రాంతంలో అతడు నివసిస్తున్నట్లు ఈ నివాస గుర్తింపు ధ్రువపత్రం తెలియజేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో శరణార్థులకు ఇది ఉపయోగపడుతుంది.

ఎంతమంది తరలివచ్చారు?
తాజా గణాంకాలు అందుబాటులో లేవు. 1951 వివరాల ప్రకారం విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌), పశ్చిమ పాకిస్తాన్‌ నుంచి 72,95,870 మంది భారత్‌కు తరలివచ్చారు. వారిలో సుమారు 47 లక్షల మంది పశ్చిమ పాకిస్తాన్‌ నుంచి తరలివచ్చిన హిందువులు, సిక్కులు. 5,764 కుటుంబాలు మినహా, మిగిలిన వారందరూ పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ముంబైలలో స్థిరపడ్డారు. జమ్మూకు తరలివచ్చిన ఆ 5,784 కుటుంబాలకు చెందిన వారిని మాత్రం జమ్మూ కశ్మీర్‌ స్థిర నివాసులుగా గుర్తించలేదు. గత ఏడు దశాబ్దాల్లో ఈ కుటుంబాలు 19,760 కుటుంబాలుగా విస్తరించాయి. వీటిలో 20 ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి.

ఎవరు వ్యతిరేకిస్తున్నారు?
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీతో పాటు వేర్పాటువాద నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. లోయలో నిరసనలకు వేర్పాటువాద నేతలు పిలుపునిచ్చారు. ముస్లిం మెజారిటీ రాష్ట్రంలో.. జనాభాలో మార్పు తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అయితే శరణార్థులు గత ఏడు దశాబ్దాలుగా కశ్మీర్‌లో నివసిస్తున్నారని, అలాంటప్పుడు జనసంఖ్యలో ఎలా మార్పు వస్తుందని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్న వారు ప్రశ్నిస్తున్నారు. ‘రోహింగ్యా ముస్లింలకు ప్రభుత్వం మద్దతు తెలిపితే సమస్య లేదు కానీ పశ్చిమ పాకిస్తాన్‌ శరణార్థులకు మద్దతిస్తే సమస్య వస్తోందా?’ అని శరణార్థులు వేర్పాటువాద నేతలను ప్రశ్నిస్తున్నారు.

రోహింగ్యాలతో సమస్య ఏమిటి?
మయన్మార్‌లో సుమారు పది లక్షల జనాభా ఉన్న బలమైన ముస్లిం సామాజిక వర్గమే రోహింగ్యాలు. అయితే బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలస వచ్చారనే కారణంగా అక్కడి ప్రభుత్వం వీరిలో చాలామందికి పౌరసత్వం కల్పించలేదు. విచారణ నుంచి తప్పించుకునేందుకు చాలా మంది భారత్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, ఇండొనేసియా దేశాలకు పారిపోయారు. ప్రస్తుతం భారత్‌లో సుమారు 40 వేల నుంచి 50 వేల మంది రోహింగ్యాలు నివసిస్తున్నట్లు అంచనా. జమ్మూ కశ్మీర్‌లో సుమారు 7 వేల–8 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది ఇళ్లలోనూ, ప్రైవేటు వాణిజ్య సంస్థల్లో కార్మికులుగా జీవిస్తున్నారు.

రోహింగ్యాల జనాభా వాస్తవంగా ఇంకా ఎక్కువగానే ఉంటుందని చాలా మంది జమ్మూ ప్రజల విశ్వాసం. నిధులు, నియామకాలు ఎక్కువగా కశ్మీరీ ముస్లింలకే దక్కుతున్నాయని భావిస్తున్న హిందూ ప్రాబల్య జమ్మూ ప్రజలు... రోహింగ్యా ముస్లింలు స్థిరపడుతుండడాన్ని అనుమానంతో చూస్తున్నారు. జమ్మూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రోహింగ్యాలు స్థానికులను వివాహం చేసుకోవడం, తద్వారా ఆ ప్రాంత జనాభాలో మార్పు తెచ్చే ప్రయత్నం జరుగుతోందని వారు భావిస్తున్నారు. పశ్చిమ పాకిస్తాన్‌ శరణార్థులు, రోహింగ్యా ముస్లింల విషయంలో జమ్మూ, కశ్మీర్‌ మధ్య çకొత్త వివాదం తలెత్తింది.

మరిన్ని వార్తలు