కరోనా పంజా: భారీ ప్యాకేజీ

26 Mar, 2020 13:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మానవాళిని మనుగుడకే పెను సవాలుగా పరిణమించిన  కరోనా (కోవిడ్-19) వైరస్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పంజా విసిరింది. సంక్షోభం దిశగా పయనిస్తున్న ఈ ఉపద్రవం నుంచి బయట పడేందుకు ఆయా దేశాలు కకావికలమవుతున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతపై పలు చర్యలతో పాటు,  ఉపశమన చర్యల్ని ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని  సిద్ధం చేసింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నిర్వహించి మీడియా సమీక్షలో పలు కీలక చర్యల్ని ప్రకటించారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. (అందరూ త్యాగాలు చేయాల్సిందే!)

 ఉపశమన చర్యలు  

 • కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7 లక్షల కోట్ల సహాయం 
 • ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద సహాయం 
 • కరోనా కేసుల్లో పని చేస్తున్న ఆరోగ్య సహాయకులకు 50 లక్షల ఆరోగ్య భీమా
 • 3 నెలలపాటు 80 కోట్ల మందికి రేషన్‌ ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్‌ యోజన్‌ ద్వారా
 • మరో 5 కేజీల బియ్యం లేదా గోధుమలుఇప్పటికే ఇస్తున్న 5 కేజీలకు అదనం
 • వీటితో పాటు కేజీ పప్పు సరఫరా చేస్తాం
 • పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ
 • పీఎం కిసాన్‌ కింద ఇప్పటికే రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇస్తున్నాం
 • మొదటి విడతగా రూ.2వేలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ 
 • ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ వేతనం రూ.202కు పెంపు
 • వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు రెండు విడతలుగా రూ.వెయ్యి
 • జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న మహిళలకు నెలకు రూ.500 చొప్పున 3 నెలలపాటు 
 • ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు
 • డ్వాక్రా గ్రూపులకు ష్యూరిటీ లేకుండా రుణాలు
 • డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు
 • ప్రావిడెంట్‌ ఫండ్‌ ఉద్యోగుల వాటాను కేంద్రమే చెల్లిస్తుంది
 • 90 శాతం మంది ఉద్యోగులు రూ.15వేల కంటే తక్కువ జీతం ఉన్న కంపెనీలకు ఇది వర్తింపు
 • తమ పీఎఫ్‌ డబ్బు నుంచి 75శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం
 • భవన నిర్మాణ కార్మికుల కోసం రూ.31వేల కోట్లు కేటాయింపు
 • రాష్ట్రాలకు కేటాయించిన మినరల్‌ ఫండ్‌ను కరోనా వైద్య పరీక్షల కోసం వాడుకోవచ్చు

మరోవైపు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ అమెరికాకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహమ్మారి ప్రభావం తీవ్రం కావడంతో  ఆ దేశ అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ ఉద్దీప‌న ప్యాకేజీ ప్ర‌క‌టించారు.  సుమారు రెండు ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ ఇవ్వ‌డానికి సెనేట‌ర్లు, వైట్‌హౌజ్ బృందం అంగీక‌రించింది. వ్యాపార‌వేత్త‌ల‌కు, కార్మికుల‌కు, వైద్య సిబ్బందికి.. ఈ ప్యాకేజీ ఇవ్వ‌నున్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఉద్దీప‌న ప్యాకేజీ నుంచి నేరుగా ఖాతాల్లోకి డ‌బ్బులు బదిలీ చేస్తారు.  

క‌రోనా వ‌ల్ల దెబ్బ‌తిన్న వ్యాపార‌ వ‌ర్గాల‌కు కూడా ఈ ప్యాకేజీ డ‌బ్బు వెళ్తుంది.  ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉద్దీప‌న ప్యాకేజీ కావడం విశేషం. ప్యాకేజీ ప్రకటన స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. దీంతో సెన్సెక్స్ మళ్లీ 30 వేల స్థాయిని  అధిగమించింది. అటు డాలర్‌ మారకంలో రూపాయి కూడా  మునుపటి ముగింపు (75.88)తో పోలిస్తే లాభపడుతోంది. అయితే మార్చి ఎఫ్‌అండ్‌ఓ కాంటాక్టు నేటితో ముగియనున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగే అవకాశం  వుందనీ అప్రమత్తత అవసరం ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా