పోలీస్ స్టేష‌న్‌లో పెళ్లి చేసుకున్న జంట‌

22 Apr, 2020 17:02 IST|Sakshi

లక్నో: క‌రోనా వ‌చ్చినా, మ‌రేదైనా ప్ర‌ళ‌యమే వ‌చ్చినా త‌మ పెళ్లి జ‌ర‌గాల్సిందేన‌ని ఓ జంట‌ క‌రోనా సాక్షిగా శ‌ప‌థం చేసుకున్నట్లుంది. ఇంట్లో పెళ్లి చేసుకుందామంటే ఇరుకిరుకు, పోనీ ఫంక్ష‌న్ హాల్ బుక్ చేసుకుందామంటే 20 మందికంటే ఎక్కువ ఉండ‌ద్దూ, సామాజిక దూరం పాటించాలి, లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కూడ‌దంటూ వంద ష‌రతులు. దీంతో ఇవ‌న్నీ కాదు కానీ అంటూ అన్నింటిక‌న్నా సేఫెస్ట్ ప్లేస్ ఎంచుకుంది. ఎంచ‌క్కా పైసా ఖ‌ర్చు లేకుండా అనుకున్న స‌మ‌యానికి క్ష‌ణాల్లో పెళ్లి ముగించుకుంది. ఎక్క‌డ‌నుకుంటున్నారా?  పోలీస్ స్టేష‌న్‌లో. అదెలాగో చ‌దివేయండి.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌హుజీకి చెందిన అనిల్‌, ఘాజీపూర్‌కు చెందిన జ్యోతి ఏప్రిల్ 20న‌ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. (పెళ్లి కోసం 800 కిలోమీటర్ల ప్రయాణం.. చివరికి)

అనుకున్న స‌మ‌యానికి పెళ్లి జ‌రిగిపోవాల్సిందేన‌ని వారు నిశ్చ‌యించుకున్నారు. ఇందుకోసం ఓ చందౌలిలోని ధీనా పోలీస్ స్టేష‌న్ పెళ్లి మండ‌పంగా‌ మారింది. సోమ‌వారం నాడు పోలీసుల స‌మ‌క్షంలో ధీనా పోలీస్ స్టేషన్‌లో ఇద్ద‌రూ వివాహం చేసుకున్నారు. సామాజిక దూరం పాటిస్తూ వేద మంత్రాల మ‌ధ్య మూడు ముళ్లతో ఒక్క‌ట‌య్యారు. ఈ విష‌యం గురించి పోలీసులు మాట్లాడుతూ.. గ‌తంలో అనిల్ బోటు ప్ర‌మాదంలో కొంత‌మంది ప్ర‌యాణికుల‌ను ర‌క్షించాడ‌ని, అప్పుడు తామంద‌రమూ అత‌ని ధైర్య‌సాహ‌సాల‌ను కొనియాడామ‌న్నారు. తాజాగా అత‌ని పెళ్లి స‌మ‌స్య‌ను త‌మ‌కు తెల‌ప‌డంతో స్టేష‌న్‌లోనే జ‌రిపేందుకు సిద్ధ‌మ‌య్యామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌ధూవ‌రుల వైపు నుంచి ఐదుగురు చొప్పున మాత్ర‌మే హాజ‌ర‌య్యార‌ని తెలిపారు. (ప్రాణం పోతుంటే కాపాడాల్సింది పోయి..)

మరిన్ని వార్తలు