ఎస్పీలో సమసిన సంక్షోభం

1 Jan, 2017 02:34 IST|Sakshi
ఎస్పీలో సమసిన సంక్షోభం

అఖిలేశ్, రాంగోపాల్‌ల బహిష్కరణ రద్దు
- తక్షణమే అమల్లోకి: ములాయం
- అఖిలేశ్‌ బలప్రదర్శన, లాలూ మంత్రాంగం ఎఫెక్ట్‌ ∙ములాయంతో అఖిలేశ్‌ భేటీ

లక్నో: యాదవ కుటుంబంలో ముదిరిన ముసలం ఒక్క రోజు తిరక్కముందే సద్దుమణిగింది. తనయుడు అఖిలేశ్‌తోపాటు రాంగోపాల్‌పై వేసిన బహిష్కరణ వేటును సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ శనివారం హైడ్రామా నడుమ వెనక్కి తీసుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలతో అఖిలేశ్‌ బలప్రదర్శన, బంధువైన ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మధ్యవర్తిత్వం ఫలించింది. ‘ములాయం ఆదేశాల మేరకు అఖిలేశ్, రాంగోపాల్‌ల బహిష్కరణను తక్షణం రద్దు చేస్తున్నాం’ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ములాయం తమ్ముడు శివపాల్‌యాదవ్‌ చెప్పారు. ‘ములాయం,  అఖిలేశ్‌లను కలిశా. అన్ని అంశాలూ కొలిక్కి వచ్చాయి. కలసికట్టుగా పూర్తి మెజారిటీతో ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ములాయంతో కూర్చుని సమస్యలను పరిష్కరించుకుంటాం’ అని చెప్పారు. బహిష్కరణ రద్దుతో.. శనివారం పార్టీ ప్రధాన కార్యదర్శిగా తాను ఏర్పాటు చేస్తున్నట్లు రాంగోపాల్‌ ప్రకటించిన ఆదివారం నాటి పార్టీ జాతీయ అత్యవసర సమావేశం ఐక్యతా ప్రదర్శనకు వేదికయ్యే వీలుంది. విభేదాల్లేవని చెప్పేందుకు ఎన్నికల కోసం అఖిలేశ్, ములాయంల ఉమ్మడి ముద్రతో కూడిన అభ్యర్థుల పేర్లతో కొత్త జాబితాను తయారు చేస్తారని సమాచారం.

అఖిలేశ్‌ ఇంట్లో బలప్రదర్శన
విభేదాలు, ములాయం తెచ్చిన అభ్యర్థుల జాబితాకు పోటీగా అఖిలేశ్, ఆయన చిన్నాన్న రాంగోపాల్‌లు జాబితా తయారు చేసిన నేపథ్యంలో క్రమశిక్షణ తప్పారంటూ వారిని పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించడం తెలిసిందే. దీంతో అఖిలేశ్‌ శనివారం 200 మందికిపైగా ఎస్పీ ఎమ్మెల్యేల(మొత్తం ఎస్పీ ఎమ్మెల్యేలు 229)తో తన నివాసంలో భేటీ అయ్యారు. భేటీకి కొందరు సీనియర్‌ ఎమ్మెల్సీలూ వచ్చారు. వారంతా ఆయనకు మద్దతు తెలిపారు. తర్వాత సీనియర్‌ నేత ఆజం ఖాన్‌ అక్కడికి చేరుకున్నారు. కాసేపటి తర్వాత అఖిలేశ్‌ తో కలసి దగ్గర్లోని ములాయం ఇంటికెళ్లి మాట్లాడారు. తర్వాత ఆజం విలేకర్లతో మాట్లాడుతూ.. ములాయం, అఖిలేశ్‌ల చర్చలు సానుకూలంగా సాగాయని, అలిగిన తండ్రి తన కొడుకుతో మాట్లాడినట్లు ఉందని చెప్పారు.

ఎమ్మెల్యేలతో అఖిలేశ్‌ భేటీ సమయంలో ఆయన ఇంటి ముందు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమికూడి ఆయనపై బహిష్కరణను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారరు. తమను అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కూడా అఖిలేశ్, శివపాల్‌ యాదవ్‌ల మద్దతుదారులు గొడవ పడ్డారు. కాగా, ఎస్పీలో సంక్షోభం దురదృష్టకరమని, పార్టీ, ములాయం కుటుంబాన్ని చీల్చేందుకు పన్నిన కుట్ర విఫలమైందని పార్టీ నేత అమర్‌ సింగ్‌ అన్నారు. ‘బహిష్కరణను రద్దు చేసి ములాయంసింగ్‌ యాదవ్‌ మంచిపని చేశారు. ఆయన బతికుండగా పార్టీని, కుటుంబాన్ని చీలనివ్వరు. పార్టీ సభ్యులందరూ ఏకతాటిపైకొచ్చి ఆయనకు అండగా నిలబడాలి’ అని కోరారు. కాగా, అఖిలేశ్‌ తిరిగి ఎస్పీలోకి వచ్చినా, ప్రభుత్వ వైఫల్యం వల్ల ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి రారని భారతీయ జనతా పార్టీ శనివారం ఎద్దేవా చేసింది.

లాలూ ఫోన్‌ రాయబారం
పట్నా: ఎస్పీ గొడవ పరిష్కారంలో లాలూ ప్రసాద్‌ ఓ చెయ్యేశారు. ములాయం, అఖిలేశ్‌లతో ఫోన్లో మాట్లాడి.. సయోధ్య కుదిర్చారు. ఎన్నికల నేపథ్యంలో గొడవలు పడొద్దని, విడివిడిగా ఎన్నికలకు వెళ్లి శత్రువులను బలోపేతం చేయొద్దని చెప్పారు. ‘మొదట ములాయంతో మాట్లాడాను. ప్రధాన్యంలేని వ్యక్తులను పట్టించుకోవద్దన్నాను. తర్వాత అఖిలేశ్‌తో మాట్లాడి తండ్రితో భేటీ కావాలని చెప్పాను.. అఖిలేశ్‌ బహిష్కరణను రద్దు్ద చేసినందుకు నాకు సంతోషంగా ఉంది’ అని లాలూ పట్నాలో విలేకర్లకు చెప్పారు. రాజీ కుదర్చడం బంధువుగా తన బాధ్యత అని అన్నారు. లాలూ కుమార్తెల్లో ఒకరిని, ములాయం సోదరుడి కుమారుడైన ఎంపీ తేజ్‌ ప్రతాప్‌యాదవ్‌కిచ్చి పెళ్లి చేయడం తెలిసిందే.

మరిన్ని వార్తలు