మన ఫ్లాట్లు మనకే

29 Jul, 2014 22:39 IST|Sakshi
మన ఫ్లాట్లు మనకే

 ఢిల్లీవాసులకే 80 శాతం కేటాయించాలని డీడీఏ యోచన
 సాక్షి, న్యూఢిల్లీ: నగరవాసులకు శుభవార్త. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) త్వరలో ప్రకటించనున్న 26,300 ఫ్లాట్ల హౌసింగ్ స్కీంలో 80 శాతం ఫ్లాట్లను నగరవాసులకే కేటాయించాలనుకుంటోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు పంపారు. ఇందుకు ఎల్జీ ఆమోదం లభించినట్లయితే పలువురు ఢిల్లీవాసుల సొంతింటి కల సాకారమయ్యే అవకాశముంది. ఇందువల్ల 80 శాతం ఫ్లాట్లు ఢిల్లీవాసులకు లభిస్తాయి. గతంలో డీడీఏ అనేక పథకాలద్వారా దాదాపు నాలుగు లక్షల ఫ్లాట్లను స్థానికులకు అందుబాటులోకి తెచ్చింది. డీడీఏ విధానం ప్రకారం ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
 
 ఈ విధానం వల్ల ఢిల్లీవాసులకు, దేశంలోని మిగతా ప్రాంతాలలో నివసించేవారితో సమంగా ఫ్లాట్లు లభించేవి. పైగా ఈ నగరంలో సొంత ఇంటి అవసరమున్న వారి కంటే దేశంలో ఎక్కడో నివసించేవారికి ఇళ్లు దక్కేవి. ఈ నేపథ్యంలో డీడీఏ పథకంలో ఢిల్లీవాసులకు కొంత శాతం ఇళ్లను రిజర్వ్ చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ ఈ డిమాండ్‌ను డీడీఏ పెద్దగా పట్టించుకోలేదు. అయితే  ప్రస్తుతం డీడీఏ వైఖరిలో మార్పు వచ్చింది  త్వరలో ప్రకటించనున్న హౌసింగ్ స్కీంలో 80 శాతం ఫ్లాట్లు డిల్లీవాలాల కోసం కేటాయించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఎల్జీ వద్ద ఉంది. ఎల్జీ దీనిని ఆమోదించవచ్చని భావిస్తున్నారు. ఈ పథకాన్ని డీడీఏ వచ్చే నెలలో ప్రకటించే అవకాశముంది.
 

మరిన్ని వార్తలు