సలీం వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం

30 Nov, 2015 13:13 IST|Sakshi
సలీం వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం

అసహనం అంశంపై లోక్‌సభలో చర్చ మొదలైన కాసేపటికే తీవ్ర గందరగోళం నెలకొంది. 193వ రూల్ కింద చర్చను ప్రారంభించిన సీపీఎం ఎంపీ సలీం చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా పాలకపక్షం బీజేపీ మండిపడింది. 800 ఏళ్ల తర్వాత మళ్లీ హిందూరాజ్యం వచ్చిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారంటూ ఆయన చెప్పడంతో సభలో దుమారం రేగింది. సలీం వ్యాఖ్యలను రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు. ఏ హోం మంత్రి అయినా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే వాళ్లకు ఆ పదవిలో ఒక్క క్షణం కూడా కూర్చునే అర్హత ఉండబోదని అన్నారు. సలీం తన వ్యాఖ్యలను నిరూపించాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే, తానెప్పుడూ ఆర్ఎస్ఎస్ సమావేశంలో కూర్చోలేదని.. కేవలం పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి మాత్రమే చెప్పానని సలీం అన్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు దేశంలో హిందూపాలన వచ్చిందని ఎన్నికల తర్వాత జరిగిన ఓ సమావేశంలో రాజ్‌నాథ్ అన్నట్లు సలీం తెలిపారు. తాను కేవలం ఒక పత్రిక కథనాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నానని, రాజ్‌నాథ్ దాన్ని ఖండించాలంటే సదరు పత్రికకు లీగల్ నోటీసు పంపాలని సూచించారు. దేశంలో అసహనం ఉందని ఎవరూ అనడం లేదని, ఈ తరహా ఆరోపణలను కావాలనే కొంతమంది పుట్టిస్తున్నారని ఆయన చెప్పారు.

కాగా.. మహ్మద్ సలీం చేసిన వ్యాఖ్యలకు తాను తీవ్రంగా మనస్తాపం చెందానని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో చెప్పారు. తర్వాత కూడా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం కొనసాగడంతో.. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 2.05 గంటలకు వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు