అబ్బాయిల ఆలోచన దృక్పథం మారాలి

7 May, 2018 13:52 IST|Sakshi

రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

సాక్షి, న్యూఢిల్లీ : చిన్నారులపై జరుగుతున్న అ‍త్యాచార ఘటనలపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పసివారిపై అ‍త్యాచారాలకు పాల్పడటం చాలా సున్నితమైన వ్యవహారమని పేర్కొన్నారు. ప్రతి 10 అత్యాచారాల్లో 7 వరకు బాధితురాలికి తెలిసివారో, ఇంట్లోవారో, బంధువులే చేస్తున్నారన్నారు. చట్టాలు మాత్రమే ఈ ఘటనలను ఆపలేవని అన్నారు. దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై కొందరు అభ్యంతరకరంగా అమ్మాయి దుస్తులపై వ్యాఖ్యానిస్తున్నారని, ఇది సరైన ధోరణి కాదని హెచ్చరించారు. అమ్మాయి డ్రెస్సింగే అత్యాచార ఘటనలకు కారణమైతే, మరి వృద్ధులపై ఎందుకు అత్యాచారం జరుగుతున్నాయని ప్రశ్నించారు.

పూర్తిస్థాయి రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ను ఫిక్కీ మహిళా విభాగం సోమవారం సన్మానించింది. ఈ సందర్భంగా లింగ హోదా సమానత్వంపై నివేదికను ఆమె విడుదల చేశారు. అనంతరం సీతారామన్‌ మాట్లాడుతూ.. మొదట అబ్బాయిల ఆలోచన దృక్పథం మారాలని, అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు జాగ్రత్తలు చెబుతుంటారు అలా కాకుండా.. మన ప్రధాని అన్నట్టు అబ్బాయిలు బయటికి వెళ్లినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పాలని సూచించారు.

వ్యాపార రంగంలోనూ, మార్కెటింగ్‌ రంగంలోనూ మహిళలు దూసుకెళ్తున్నారని, ముద్ర బ్యాంకు ఇచ్చే రుణాల్లో 50 శాతం మహిళలకే వెళ్తున్నాయని చెప్పారు. పంచాయతీయ రాజ్‌ సవరణ తెచ్చాక మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని, ఇక రక్షణ రంగంలోనూ మహిళలకు సమానవకాశాల కోసం కృషి చేస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు