రక్షణ మంత్రి చరిత్రాత్మక నిర్ణయం

19 Jan, 2019 08:34 IST|Sakshi

ఆర్మీ జవానులుగా మహిళలు

మిలటరీ పోలీసు విభాగంలో క్రమక్రమంగా మహిళలకు అవకాశం

20శాతం మహిళలకు

సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.  మిలటరీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మహిళలకు కూడా ప్రవేశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిలటరీ పోలీసు విభాగంలో మహిళల శాతాన్ని 20కి పెరిగేలా అంచెలంచెలుగా ప్రయత్నిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  ఈ మేరకు రక్షణమంత్రి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఆర్మీలో లైంగిక దాడులు, వేధింపుల వంటి కేసులను పరిష్కరించేందుకు వారి సేవలు ఉపయోగపడతాయని భావిస్తున్నామన్నారు.

సేవారంగాల్లోకి ఎక్కువమంది మహిళలను తీసుకురావాలనే  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంలో భాగంగా రక్షణ దళాలలో మహిళాశక్తిని పెంచాలని రక్షణశాఖ నిర్ణయించింది. ఏడాదికి సుమారు 52 మంది చొప్పున 800 మందిని మిలటరీ పోలీస్ విభాగంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని రక్షణ శాఖ భావిస్తోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో  ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఎదుర్కొనేందుకు ఆర్మీలోమహిళా జవానుల అవసరం చాలా కనుపడుతోందని ఈ నేపథ్యంలో మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు గత ఏడాది ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆర్మీలో మహిళలు కొన్ని సేవలకు మాత్రమే పరిమితమవుతున్నారు. విద్య, వైద్యం, న్యాయసేవలు, సిగ్నల్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు