కఠిన చట్టాలొచ్చినా..!

29 May, 2018 22:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కఠిన చట్టాలున్నా వాటి అమలు సరిగ్గా జరగకపోతే లేదా అమల్లో తీవ్ర జాప్యం జరిగితే వాటి వల్ల ప్రయోజనం ఏముంటుందన్న ప్రశ్నలు మళ్లీ ఉత్పన్నమవుతున్నాయి. పన్నెండేళ్ల లోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించేందుకు అనుమతిస్తూ ఇటీవల కేంద్రం ఆర్డినెన్స్‌ జారీచేసింది. ఈ నేపథ్యంలో క్రూరమైన నేరాలు జరగకుండా ఉరిశిక్షలు ఏ మేరకు హెచ్చరికలుగా నిలుస్తాయన్నది చర్చనీయాంశమవుతోంది. ఐరాసతో సహా ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు మరణశిక్షలు అమానవీయమని వీటిని రద్దు చేయాలని గట్టిగా డిమాండ్‌చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉరిశిక్షల అమలు వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు కూడా ఉద్భవిస్తున్నాయి. ముఖ్యంగా  మనదేశంలోని న్యాయస్థానాల్లో కేసుల విచారణ సుదీర్ఘకాలం పాటు సాగడం వల్ల  నిందితులు తీవ్ర నేరాలకు పాల్పడకుండా మరణశిక్షలు నియంత్రణగా ఉపయోగపడడం లేదని అభిప్రాయపడుతున్న వారూ ఉన్నారు.

2017 ఆఖరు నాటికి భారత్‌లో 371 మంది మరణశిక్ష పడిన ఖైదీలున్నారు. వారిలో... 1991లో శిక్ష పడిన ఖైదీ కూడా ఉన్నాడు. అంటే అతడిది 27 ఏళ్ల నిరీక్షణ. 2017లో దేశవ్యాప్తంగా వివిధస్థాయిల్లోని న్యాయస్థానాలు 109 మందికి ఉరిశిక్ష విధించాయి. 2016లో ఈ సంఖ్య 149గా ఉంది. అయితే గత పధ్నాలుగేళ్లలో కేవలం నలుగురికి మాత్రమే ఈ శిక్షను అమలుచేశారు. వీరిలోనూ ముగ్గురికి తీవ్రవాద కార్యకలాపాలు పాల్పడినందుకు, ఒకరికి మాత్రమే మైనర్‌పై లైంగికదాడి, హత్యకు పాల్పడినందుకు మరణశిక్ష విధించారు.

  • ఉరిశిక్ష పడిన 127 మంది ఖైదీల కేసుల విచారణకు అయిదేళ్లకు పైగా, 54 మందికి పదేళ్లకు పైగా, మిగతా వారికి అయిదేళ్ల వరకు సమయం పడుతోంది.
  • ఉరిశిక్ష రద్దుకు ఖైదీలు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్రపతి తిరస్కరణకు గురవడానికి మధ్యకాలంలో 10 నుంచి 16 ఏళ్ల శిక్షను వారు అనుభవిస్తున్నారు. 
  • ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఢిల్లీ నిర్భయ అత్యాచారం కేసులో పడిన ఉరిశిక్షను సమీక్షించాలంటూ నలుగురిలో ఇద్దరు ఖైదీలు పెట్టుకున్న పిటీషన్‌పై  ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకటన వాయిదా వేసింది. 

ఉరిశిక్షలనేవి నేరస్థులను అంతమొందిస్తాయే తప్ప నేరాన్ని కాదంటూ ఈ ఖైదీల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ వాదించారు. ఎవరు జీవించాలి, ఎవరు మరణించాలి అన్న విషయాన్ని న్యాయస్థానాలు ఎలా నిర్ణయిస్తాయంటూ ప్రశ్నించారు. 

గత 14 ఏళ్లలో ఉరి అమలు 4 కేసుల్లోనే...

  • 1993 నాటి ముంబై వరుస బాంబుపేలుళ్ల కేసులో  2015 జులై 30న యాకుబ్‌ మెమన్‌కు నాగ్‌పూర్‌ జైలులో ఉరిశిక్ష అమలుచేశారు
  • పార్లమెంట్‌పై దాడి చేసులో మహ్మద్‌ అఫ్జల్‌ గురుకు 2013 ఫిబ్రవరి 9న ఢిల్లీ తీహార్‌ జైలులో శిక్ష పూర్తిచేశారు.
  • 2008లో ముంబైపై పాక్‌ ముష్కరులు ఉగ్రదాడి జరిపిన కేసులో సజీవంగా పట్టుకున్న అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ను 2012 నవంబర్‌ 21న పుణెలోని ఎరవాడ జైలులో ఉరితీశారు. 
  • టీనేజీ అమ్మాయి అత్యాచారం,హత్య కేసులో 2004 ఆగస్టు 14న  పశ్చిమబెంగాల్‌ లోని అలీపూర్‌ జైలులో ధనుంజయ్‌ ఛటర్జీ (42)కి మరణశిక్ష అమలుచేశారు.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

మరిన్ని వార్తలు