భారత్‌, పాక్‌ సంచలన నిర్ణయం

29 May, 2018 22:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దాయాది దేశాలైన భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య సరిహద్దుల్లో ఎప్పుడూ భీకర వాతావరణమే దర్శనమిస్తుంది. గతంలో పలుమార్లు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణపై చర్చలు జరిగినప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి. తాజాగా 2003లో కుదుర్చుకున్న కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని మంగళవారం ఇరు దేశాలు నిర్ణయించాయి. రెండు దేశాల మిలటరీ ఉన్నతాధికారులు హాట్‌లైన్‌ ద్వారా జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లోని పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఇరుదేశాల అధికారులు కలసి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పరిస్థితులపై సమీక్ష నిర్వహించినట్టు భారత ఆర్మీ పేర్కొంది. సరిహద్దుల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు స్థానిక కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్‌ మీటింగ్స్‌ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక హాట్‌లైన్‌ ద్వారా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. ఇదే విషయాన్ని పాక్‌ ఆర్మీ కూడా స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు