శివకుమార్‌ కస్టడీ పొడిగింపు

14 Sep, 2019 04:13 IST|Sakshi
డీకే శివకుమార్‌

మరో 4 రోజులపాటు ఈడీకి అనుమతి

ఆయన ఆరోగ్యానికే ప్రాధాన్యమన్న కోర్టు

సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రె స్‌ పార్టీ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు కోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్‌ కేసులో ఈడీ కస్టడీని మరో 4 రోజుల పాటు పొడిగిస్తూ ఢిల్లీలోని ఈడీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పు సందర్భంగా జడ్జి అజయ్‌ కుమార్‌ కుహర్‌ మాట్లాడుతూ తమ మొదటి ప్రాధాన్యం శివకుమార్‌ ఆరోగ్యమేనని, ఆయనకున్న వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని ఈడీకి సూచించారు. ప్రతి 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించాలని, అవసరమైతే మధ్యలోకూడా పరీక్షలు చేయించాలని చెప్పారు. రోజులో అరగంట పాటు ఆయన  కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కల్పించారు. ఈడీ అరెస్ట్‌ చేసిన వెనువెంటనే కస్టడీకి ఇచ్చే అవకాశం ఏదీ ఉండదని, అయితే తగిన అధారాలు ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా, స్వేచ్ఛగా పని చేసేందుకు కస్టడీకి అనుమతి ఇవ్వాల్సి వస్తోందని పేర్కొన్నారు. మనీ ల్యాండరింగ్‌ కేసులో ఈ నెల 3న అరెస్టయిన శివకుమార్‌ గత 9 రోజులుగా ఈడీ అదుపులోనే ఉన్న సంగతి తెలిసిందే.  

శివకుమార్‌ సహకరించట్లేదు..
శివకుమార్‌ను విచారించేందుకు అయిదు రోజుల కస్టడీ కావాలని ఈడీ  అంతకుముందు ఢిల్లీ కోర్టును కోరింది. విచారణకు శివకుమార్‌ సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చారని, కాబట్టి మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఆయన వద్ద రూ. 200 కోట్లకు పైగా అక్రమ సంపాదన ఉందని, రూ. 800 కోట్ల విలువ చేసే ఆస్తులు బినామీల పేరిట ఉన్నాయని ఈడీ పేర్కొంది.  అలాగైతే అయిదు రోజుల కస్టడీలో కూడా ఆయన ఏమీ చెప్పరని కోర్టు అభిప్రాయపడింది. శివకుమార్‌ నడుపుతున్న ట్రస్టు, ఆస్తులు, కోట్ల రూపాయల వ్యాపారాల వెనుక ఆయన కుమార్తె ఐశ్వర్య ఉన్నట్లు ఈడీ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు