‘కుక్క మాంసం తినండి.. ఆరోగ్యంగా ఉండండి’

5 Nov, 2019 10:29 IST|Sakshi

కోల్‌కతా : గోమాంసం తినేవాళ్లందరూ కుక్క మాంసం కూడా తినాలంటూ పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేధావులంతా రోడ్లపై బీఫ్‌ తింటున్నారని... ఇకపై వారు అన్ని రకాల జంతువులను కూడా ఇలాగే చంపి తింటే ఆరోగ్యం బాగుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే రోడ్డుపై కాకుండా ఇంట్లోనే ఆ వంటకాలు తయారు చేసుకుని తినాలని సూచించారు. బుర్దావన్‌లో సోమవారం జరిగిన గోపా అష్టమి కార్యక్రమంలో దిలీప్‌ ఘోష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గో హత్య మహాపాతకమని పేర్కొన్నారు. ‘ గోవు మన తల్లి. ఆమె పాలు తాగి మనం ఈరోజు జీవిస్తున్నాం. కాబట్టి ఇటువంటి నా తల్లితో ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే నేను సహించను. పవిత్రమైన భారత భూమిపై గోవధ చేసి ఆ మాంసం తినటం క్షమించరాని నేరం. ఆవు పాలు బంగారం వంటివి. అందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆవు మాంసం తింటే మంచిదంటూ రోడ్లపై పడి భోజనం చేస్తున్నవాళ్లు కుక్క మాంసంతో పాటు అన్ని రకాల జంతువుల మాంసం తింటే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఏదైనా మీ ఇంట్లోనే తినండి. రోడ్లపై నానాయాగీ చేయకండి’ అని మేధావివర్గంపై విమర్శలు గుప్పించారు. 

కాగా దిలీప్‌ ఘోష్‌ గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. దేశీ ఆవులు అమ్మతో సమానం గనుక.. వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని.. విదేశీ ఆవు జాతులను పెంచడం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. ఈ క్రమంలో విదేశీ వనితలను భార్యలుగా చేసుకున్న వారు ఎలాంటి సమస్యల్లో చిక్కుకుపోయారో గమనించాలని విఙ్ఞప్తి చేశారు. అంతేగాకుండా తూర్పు మిడ్నాపూర్‌లో తమ కార్యకర్తలపై దాడులను ప్రోత్సహిస్తున్నారంటూ.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసు ఉన్నతాధికారిని చంపుతానని బెదిరించారు. బీజేపీ కార్యకర్తలతో తప్పుగా ప్రవర్తిస్తే అంత్యక్రియలు చేసేందుకు శవం కూడా దొరకకుండా చేస్తామని ఆయనను హెచ్చరించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు