పళని ప్రభుత్వం నిలిచేనా?

22 Aug, 2017 09:23 IST|Sakshi
పళని ప్రభుత్వం నిలిచేనా?

అవిశ్వాస తీర్మానంపై స్టాలిన్‌ యోచన
► కూల్చివేత తప్పదు: శశికళ వర్గం హెచ్చరిక
►  మ్యాజిక్‌ ఫిగర్‌కు 13 సీట్ల దూరంలో సర్కారు
► శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు


సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం పళనిస్వామి ప్రభుత్వానికి సంతోషం కంటే చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఓవైపు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ తన వర్గం (28 మంది)ఎమ్మెల్యేలతో బయటకు వచ్చే పరిస్థితి నెలకొనడం, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్‌ అవిశ్వాస తీర్మాన సన్నాహాల్లో ఉండటంతో అన్నాడీఎంకే ప్రభుత్వం పూర్తికాలం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జయలలిత కన్నుమూసినప్పటినుంచీ అధికారం కోసం డీఎంకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అటు శశికళ జైలుకెళ్లినప్పటినుంచీ పార్టీ, ప్రభుత్వంపై పెత్తనం కోసం టీటీవీ దినకరన్‌  పాకులాడుతున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా మారుతున్న తమిళ రాజకీయాల్లో తర్వాత ఏం జరగనుందనేది ఆసక్తి రేపుతోంది.

దినకరన్‌ వర్గం రాజీనామా చేస్తే!
తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య 234 (జయలలిత మరణంతో ఆర్కేనగర్‌ ఖాళీగా ఉంది). ఇందులో ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 118. జయ మరణం తర్వాత పన్నీర్‌ వర్గం విడిపోవటంతో జరిగిన విశ్వాస పరీక్షలో పళనిస్వామి 122 సీట్లతో గట్టెక్కారు. ఇందులో పళనిస్వామి వద్ద 94 మంది ఎమ్మెల్యేలుండగా.. దినకరన్, దివాకరన్‌ (20+8 మంది సభ్యులు)లు మద్దతు తెలిపారు.

అయితే తాజా విలీనం, శశికళను పార్టీనుంచి బహిష్కరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో దినకరన్, దివాకరన్‌ అసంతృప్తితో ఉన్నారు. వీరు మంగళవారం గవర్నర్‌ విద్యాసాగర్‌ రావుతో భేటీ కానున్నారు. ఒకవేళ వీరందరితో దినకరన్‌ రాజీనామా చేయిస్తే.. (చెన్నైలో ఈ చర్చ జరగుతోంది) మ్యాజిక్‌ ఫిగర్‌ 104కు తగ్గి.. పన్నీర్, పళనిలకు (94+11=105) మేలు జరుగుతుంది. అయితే, ఇన్నిరోజులు కష్టపడీ దినకరన్‌ ఇంత సులువుగా పళనికి అవకాశమిస్తారా అనేది ప్రశ్నార్థకమే.
 
మద్దతు వెనక్కి తీసుకుంటే?
ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఈ 28 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు వెల్లడిస్తే.. పళని సర్కారు మైనారిటీలో పడుతుంది. అప్పుడు స్టాలిన్‌ పెట్టే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వీరు ఓటేస్తే.. ప్రభుత్వం కూలటం ఖాయమే. అసెంబ్లీలో డీఎంకేకు 89, కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలుండగా ముస్లింలీగ్‌కు ఒక సభ్యుడున్నాడు. స్టాలిన్‌కు దినకరన్‌ వర్గం మద్దతిచ్చినట్లయితే.. ఈ కూటమి బలం (89+8+1+28) 126కు చేరుతుంది.

అయితే.. అన్నాడీఎంకేను ఓడించేందుకు దినకరన్‌ వర్గం డీఎంకేతో చేతులు కలుపుతుందా అనేదానిపై చర్చ జరుగుతోంది. స్టాలిన్, దినకరన్‌ లక్ష్యం పళని ప్రభుత్వంపై వ్యతిరేకతే కనుక వీరిద్దరూ కలవటంలో తప్పేముందనే వాదనా చెన్నై రాజకీయాల్లో వినబడుతోంది. వారం రోజుల క్రితం స్టాలిన్‌ లండన్‌ వెళ్లినపుడు దినకరన్‌ దూత ఆయన్ను కలసి చర్చించినట్లు తమిళ పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వ భవిష్యత్తు డీఎంకే చేతుల్లోకి వెళ్లిపోయింది.

మరిన్ని వార్తలు