దివ్య స్పందన కేసులో 50 లక్షల ఫైన్‌

8 May, 2019 17:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ఎంపీ, కన్నడ సినీ నటి దివ్య స్పందన (రమ్య)కు పరువు నష్టం కేసులో 50 లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా ఆసియా నెట్‌ టీవీ ఛానెల్, దాని అనుబంధ సంస్థ సువర్ణ న్యూస్‌ను బెంగళూరు కోర్టు ఇటీవల ఆదేశించింది. 2013లో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో ఆమెను తప్పుగా ఇరికించినట్లు కోర్టు తీర్పు చెప్పింది. ఇక ముందు సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ స్కామ్‌తో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి వార్తలు ప్రసారం చేయరాదని కూడా ఆదేశించినట్లు ‘బార్‌ అండ్‌ బెంచ్‌’ వెబ్‌సైట్‌ బుధవారం వెల్లడించింది.

బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ ఐపీఎల్‌ జట్టుకు దివ్య స్పందన బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేశారు. అయితే ఆమె 2013 ఐపీఎల్‌ ఎడిషన్‌కు పనిచేయలేదు. అప్పుడు జరిగిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో ఇద్దరు కన్నడ నటీమణుల హస్తం ఉందంటూ పేర్లు వెల్లడించకుండా దివ్వ స్పందనను చూపిస్తూ ఓ వార్తా కథనం ఆసియానెట్‌ ఛానెల్‌తోపాటు సువర్ణ న్యూస్‌ ఛానెల్‌లో ప్రసారం చేశారు. ఎవరి పేర్లను ప్రస్తావించనందున దివ్వ స్పందన పరువుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఛానెళ్లు వాదించాయి. స్పందనను చూపినందున ఆమెకు నష్టం జరిగిందని కోర్టు భావించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు