స్పాంజ్ వదిలివేసినందుకు 18 లక్షలు.....

10 May, 2014 09:12 IST|Sakshi
స్పాంజ్ వదిలివేసినందుకు 18 లక్షలు.....

న్యూఢిల్లీ : సర్జరీ సమయంలో కడుపులో కత్తులు వదిలేయడం, డాక్టర్లు ఫోన్లు మర్చిపోవడం.. వంటివన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం. అది నవ్వుకోవడానికి బాగుంటుంది కానీ నిజజీవితంలో బాధితుల ప్రాణాలు పోయేంత పని అవుతాయి. వివరాల్లోకి వెళితే ప్రసవం కోసం వెళ్తే కడుపులో స్పాంజ్ను ఉంచి... ఆమె ప్రాణాలపైకి తెచ్చిన డాక్టర్లు ఉన్నారు.  ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

మహిళకు శస్త్ర చికిత్స చేసి, కడుపులో స్పాంజ్ వదిలివేసినందుకు 18 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని సర్జరీ చేసిన వైద్యులు, నర్సింగ్హోమ్ను వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ఢిల్లీలోని కైలాష్ నగర్కు చెందిన స్వేతా ఖండేల్వాల్ ప్రసవం కోసం 2012లో రిషబ్ మెడికల్ సెంటర్కు వెళ్లింది.  అదే సంవత్సరం సెప్టెంబర్ 13న శస్త్రచికిత్స చేసిన వైద్యులు శిశువును తీసి ఆమె కడుపులో స్పాంజ్ను వదిలేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత స్వేతా ఖండేల్వాల్కు పలుమార్లు కడుపునొప్పి రావడంతో ఆమె మళ్లీ అదే ఆస్పత్రికి వెళ్లింది. అయితే డాక్టర్లు ఆమెకు ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. ఆమె ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తుండటంతో మరో ఆస్పత్రిలో చేరింది.

పరీక్ష చేసిన అక్కడి వైద్యుల ఇన్పెక్షన్ కారణంగా కడుపులో చీము ఉన్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి అందుకు కారణమైన స్పాంజ్ ముక్కలను బయటకు తీశారు. బాధితురాలు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. దాంతో ఆమెకు కలిగించిన నష్టానికిగానూ 18 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని రిషబ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.కె.జైన్, డాక్టర్ ఉషా జైన్లను ఫోరం ఆదేశించింది.

 

మరిన్ని వార్తలు