ప్రాణ హాని.. మరో జైలుకు పంపండి: దవీందర్‌ సింగ్‌

7 Feb, 2020 12:01 IST|Sakshi

న్యూఢిల్లీ: హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ దవీందర్‌ సింగ్‌ తనను మరో జైలుకు మార్చాలంటూ.. జమ్మూలోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కోర్టును అభ్యర్థించారు. తను గతంలో అరెస్ట్‌ చేసిన పులువురు ఉగ్రవాదులు కోట్బాల్‌వాల్‌ జైలులో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారితో తనకు ప్రాణహాని ఉందని కోర్టుకు విన్నవించుకున్నారు. తనను కోట్బాల్‌వాల్‌ జైలు నుంచి హీరానగర్ జైలుకు పంపించాలని ఎన్‌ఐఏ న్యాయస్థానాన్ని దవీందర్‌ అభ్యర్థించారు. కాగా దవీందర్‌ అభ్యర్థనకు కోర్టు అనుమతిస్తూ ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: ఉగ్రవాద డీఎస్పీ దవీందర్‌ సింగ్‌!

ఇక పదిరోజుల పాటు జమ్మూకశ్మీర్ పోలీసుల అదుపులో ఉన్న దవీందర్‌ను.. దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ 15 రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం దవీందర్‌ను రిమాండ్‌కి పంపించింది. కాగా డీఎస్పీ దవీందర్‌ సింగ్‌ కరుడుగట్టిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది నవీద్‌ బాబా, అతని అనుచరుడితో కలిసి కారులో ప్రయాణిస్తూ జనవరి 11న పోలీసులకు చిక్కిన విషయం విదితమే. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులకు తన ఇంట్లో ఆశ్రయించి కల్పించినందుకు పోలీసులు దవీందర్‌ సింగ్‌ను ఆరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు