అలా రహస్యంగా అమ్మకు లెటర్లు రాశాను: ఇల్తిజా

7 Feb, 2020 12:08 IST|Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌ ప్రజల ప్రాథమిక హక్కులు నేటికీ ఉల్లంఘనకు గురవుతున్నాయని జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి కుమార్తె ఇల్తిజా జావేద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీరీల ఆర్థిక, మానసిక కష్టాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేసిన నాటి (2019, ఆగస్ట్‌ 5) నుంచి మెహబూబా ముఫ్తి సహా మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని సొంత నివాసాలకు తరలిస్తున్నట్లు అధికారులు ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే వారిద్దరిపై కఠినమైన ప్రజా భద్రత చట్టం(పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌-పీఎస్‌ఏ) కింద గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మెహబూబా ముఫ్తి కుమార్తె తాజా పరిణామాలపై ముఫ్తి ట్విటర్‌ అకౌంట్‌లో ఓ లేఖ పోస్టు చేశారు.(కశ్మీర్‌ నేతలకు మరోషాక్‌!)

‘‘ఆర్టికల్‌ 370 రద్దు జరిగిన నాటి నుంచి గత ఆరు నెలలుగా మా అమ్మ గృహ నిర్బంధంలో ఉన్నారు. అమ్మను అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్లిన రోజును నేను ఎన్నటికీ మర్చిపోలేను. గృహ నిర్బంధంలోకి వెళ్లిన నాటి నుంచి ఆమెను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూశాను. ఓ రోజు టిఫిన్‌ బా​క్సులో ఉత్తరాన్ని చూసి ఆశ్చర్యపోయాను. తన కోసం పంపిన బాక్సులో... ‘‘నా సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా సందేశాలు పోస్టు చేసిన వారిని కూడా వాళ్లు అరెస్టు చేస్తారు. లవ్‌ యూ మిస్‌ యూ’’ అనే ఉత్తరం కనిపించింది. అయితే అమ్మకు ఎలా బదులివ్వాలో అర్థం కాలేదు. అప్పుడే గ్రానీ ఒక ఐడియా ఇచ్చారు. అప్పుడు లెటర్‌ రాసి.. దానిని చిన్నగా మలిచి.. చపాతీలో చుట్టిపెట్టాను. (‘ఏం చేశాను.. నన్ను కూడా బంధించారు’)

ఇలా నేను ఒక్కదాన్నే కాదు ఎంతో మంది తమ ప్రియమైన వారితో మాట్లాడే అవకాశం కోల్పోయారు. అంతేకాదు ఆర్థికంగా కూడా జమ్మూ కశ్మీర్‌ ఎంతో నష్టపోయింది. కేవలం ఇవే కాదు.. పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్య తీర్పు వంటివి ఇలాంటి కష్టాలను మరింతగా పెంచుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వీటిని చూసి ఎంజాయ్‌ చేస్తోంది. ఒక కూతురిగా మా అమ్మను భద్రతా బలగాలు బంధించడం నేను చూశాను. ఆమెను విముక్తురాలు చేసేందుకు చిన్నపాటి యుద్ధం చేశాను. ఇక బతుకు పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని ఇల్తిజా తన లేఖలో రాసుకొచ్చారు. కాగా తాజాగా ముఫ్తి, ఒమర్‌ అబ్దుల్లాపై నమోదైన (పీఎస్‌ఏ) ‘పబ్లిక్‌ ఆర్డర్‌’ సెక్షన్‌ ప్రకారం విచారణ లేకుండా ఆరు నెలలు, ‘రాజ్య భద్రతకు ప్రమాదం’ అనే సెక్షన్‌ ప్రకారం విచారణ లేకుండా రెండు సంవత్సరాల వరకు అనుమానితులను నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టం ఒమర్‌ అబ్దుల్లా తాత షేక్‌ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందింది. ముఖ్యంగా కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. 

మరిన్ని వార్తలు