58 మంది భారత్‌కు వస్తున్నారు: జైశంకర్‌

10 Mar, 2020 10:22 IST|Sakshi

ఇరాన్‌ నుంచి స్వదేశానికి 58 మంది భారతీయులు

న్యూఢిల్లీ: ప్రాణాంతక కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తి నేపథ్యంలో ఇరాన్‌లో ఉండిపోయిన భారత యాత్రికులను సురక్షితంగా దేశానికి తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేశామని విదేశాంగ శాఖా మంత్రి ఎస్‌. జైశంకర్‌ తెలిపారు. మొదటి విడతలో భాగంగా 58 మంది భారతీయులను తీసుకువచ్చేందుకు వైమానిక దళ(ఐఏఎఫ్‌ సీ-17) విమానం టెహ్రాన్‌ నుంచి బయల్దేరిందని పేర్కొన్నారు. కొన్ని గంటల్లోనే ఈ విమానం ఉత్తరప్రదేశ్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్‌ కానుందని వెల్లడించారు. అదే విధంగా ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహకరిస్తున్న ఎంబసీ అధికారులు, వైద్య సిబ్బందికి జైశంకర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కఠిన పరిస్థితుల్లో తమకు చేదోడువాదోడుగా నిలుస్తున్నందుకు ఇరాన్‌ అధికారులను ప్రశంసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. తాజా సమాచారం ప్రకారం... 58 మంది భారతీయులతో భారత వైమానిక దళం హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. వైద్యపరీక్షలు నిర్వహించి వారిని స్వదేశానికి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు.(‘కోవిడ్‌’పై ట్రంప్‌ ట్వీట్‌.. కీలక నిర్ణయం!)

కాగా చైనాలో పుట్టి ప్రపంచమంతా విస్తరిస్తున్న కరోనా ధాటికి 95కు పైగా దేశాలు విలవిల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 3800 మందికి పైగా మృత్యువాత పడగా.. లక్షలాది మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఇక ఇరాన్‌లో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 7161కి చేరుకుంది. కరోనా కారణంగా సోమవారం 43 మంది మరణించగా ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 237గా ఉంది. రాజధాని టెహ్రాన్‌లో మొత్తం 1945 కోవిడ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు వెళ్లిన భారత యాత్రికుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. (ఇప్పటివరకు 3,800 మంది మృతి)

మరిన్ని వార్తలు