హీరోయిన్‌పై కోడిగుడ్లతో దాడి

26 Aug, 2016 08:07 IST|Sakshi
హీరోయిన్‌పై కోడిగుడ్లతో దాడి

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి.. పాక్ అనుకూల వ్యాఖ్యలతో వివాదం సృష్టించిన కన్నడ నటి రమ్యపై కోడిగుడ్లతో దాడి జరిగింది. ఆమె మంగళూరు వెళ్లి.. ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోకి వెళ్తుండగా కొంతమంది నిరసనకారులు ఆమెను అడ్డగించి కోడిగుడ్లు విసిరారు. తాను మంగళూరులో దిగగానే తనకు నల్లజెండాలు చూపించి, కోడిగుడ్లు విసిరారని, అయినా తాను మాత్రం అన్న మాటకు కట్టుబడే ఉంటాను తప్ప తన మాటలను వెనక్కి తీసుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. వీళ్లు సంఘ్ పరివార్‌కు చెందినవారై ఉండొచ్చని పోలీసులు తనకు చెప్పినట్లు రమ్య తెలిపారు.

పాకిస్థాన్ వెళ్లడం అంటే నరకానికి వెళ్లడమేనన్న రక్షణమంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యలను ఇంతకుముందు రమ్య ఖండించారు. పాకిస్థాన్ కూడా చాలా మంచి ప్రాంతమని, అక్కడి ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని, అక్కడివాళ్లు కూడా మనలాంటివాళ్లేనని అన్నారు. రాజద్రోహం చట్టాలను మనం సవరించుకోవాలని, దాన్ని పూర్తిగా మార్చాలి లేదా రద్దుచేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తనలాంటి వాళ్లు చాలామంది మీద ఇలాగే వేధింపులు కొనసాగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తనమీద రాజద్రోహం ఆరోపణలు చేయడం రాజకీయ కుట్ర అని, లేకపోతే ఫిర్యాదు కాపీ ముందుగా మీడియాకు అసలు ఎలా వెళ్లిందని రమ్య అడిగారు. బీజేపీ తమ సిద్ధాంతాలను వ్యతిరేకించేవాళ్లపై ఇలాంటి అస్త్రాలు ప్రయోగిస్తోందని, హిందూత్వ తీవ్రవాదులు మాత్రమే తనపై రాజద్రోహం ఆరోపణలను సమర్థిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకకు చెందిన స్థానిక టీవీ చానళ్లు అనవసరంగా ఈ విషయాన్ని సంచలనాత్మకం చేస్తున్నాయని, వాళ్లు 'పాకిస్థాన్‌కు రమ్య మద్దతు' అనే శీర్షికలు పెడుతున్నారని చెప్పారు. ఇక్కడ 20 చానళ్లు ఉండటంతో ఒకరికి ఒకరు పోటీగా ఇలా నడిపిస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు