రైతుల నిరసనపై విరిగిన లాఠీ..

1 Jun, 2018 18:27 IST|Sakshi
జైపూర్‌లో రైతుల నిరసనపై పోలీసుల లాఠీచార్జ్‌

సాక్షి, జైపూర్‌ : సమస్యలపై సమరభేరి మోగించిన రైతుల నిరసన హింసాత్మకంగా మారింది. తమ పంటలకు కనీస మద్దతు ధరతో పాటు రుణ మాఫీ ప్రకటించాలని కోరుతూ శుక్రవారం జైపూర్‌లో రైతులు పండ్లు, కూరగాయలు, పాలను రోడ్డుపై పారవేసి నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో రైతులు వారిపైకి కూరగాయలను విసిరారు. మరోవైపు తమ డిమాండ్లను నెరవేర్చకుంటే పాలు, కూరగాయల అమ్మకాలను నిలిపివేస్తామని ఆందోళనబాట పట్టిన పలు రాష్ట్రాల రైతులు హెచ్చరించారు. జూన్‌ 1 నుంచి జూన్‌ పది వరకూ వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాను నిలిపివేస్తామని 172 రైతు సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కిసాన్‌ ఏక్తా మంచ్‌, రాష్ర్టీయ కిసాన్‌ మహా సంఘ్‌లు ప్రకటించాయి.

రైతులు తమ ఉత్పత్తులను గ్రామాల్లోనే విక్రయించాలని, నగరాలకు పంపవద్దని కోరామని భారత్‌ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు బల్బీర్‌ సింగ్‌ రజేవాల్‌ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆత్మహత్యల నిరోధానికి ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కనీస మద్దతు ధరలు కల్పించడం లేదని, స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయడం లేదని అన్నారు. రైతుల డిమాండ్లకు మద్దతుగా పలు రైతు సంఘాలు ఆదివారం భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. రాజస్థాన్‌, హర్యానా, ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో బంద్‌ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు