వడోదరలో ఎక్కడ చూసినా మొసళ్లే

4 Aug, 2019 16:59 IST|Sakshi

వడోదర : ఎండాకాలం పోయింది. వర్షాలు కురుస్తున్నాయి. చల్లగా ఉంటుందిలే అనుకుంటే గుజరాత్‌లోని వడోదర నగర వాసులకు ‘కొత్త’ కష్టాలు మొదలయ్యాయి. బుధవారం నుంచి భారీ వర్షాలు కురవడంతో వరదనీరు నగరాన్ని ముంచెత్తింది. అంతేనా.. శనివారం కాస్త వర్షాలు తగ్గి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఊపిరిపీల్చుకుంటున్న నగరవాసులకు మొసళ్ల రూపంలో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. వరదలతోపాటే నగరంలోకి కొట్టుకొచ్చిన మొసళ్లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుండటంతో వారు భయంతో వణికిపోతున్నారు. ఎక్కడి నుంచి మొసలి వచ్చి దాడి చేస్తుందేమోనని భయపడి ఇళ్లలోనుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.

ఇలా మొసళ్లతో పడుతున్న బాధలను వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇప్పుడు వడోదర నుంచి ఏ పోస్టు వచ్చినా మొసళ్లతో పడుతున్న బాధల గురించే ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు మొసళ్లు అక్కడి రోడ్లపై ఏ రేంజ్‌లో స్వైరవిహారం చేస్తున్నాయో.. మొన్న నీళ్లలోంచి మొసలి హఠాత్తుగా వచ్చి వీధి కుక్కపై దాడి చేయబోయిన వీడియో వైరల్‌ కాకముందే తాజాగా నడిరోడ్డుపై మొసలి కనిపించడం, దాన్ని రెస్క్యూ టీం చాకచక్యంగా బంధించే వీడియో వైరల్‌ అవుతోంది. రెస్క్యూ సిబ్బంది గత మూడు రోజులుగా మొసళ్లను బంధించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఒక దాన్ని బంధించి సురక్షిత ప్రదేశంలో విడవగానే మరొకచోట నుంచి ఫోన్‌ వస్తోందని రెస్క్యూ సిబ్బంది ఒకరు వెల్లడించారు. నగరంలో నుంచి వరద నీరు పూర్తిగా వెళ్లేంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

మరిన్ని వార్తలు