అయ్యో మేక : కోల్‌ ఇండియాకు భారీ నష‍్టం

3 Oct, 2019 11:12 IST|Sakshi

 మేక మృతితో ఆందోళనకు దిగిన స్థానికులు

 మూడున్నర గంటలు  నిలిచిపోయిన పనులు

రూ.2.7 కోట్ల రూపాయల నష్టం

భువనేశ్వర్‌:  ఓ మూగ జీవి మరణం కోల్‌ ఇండియాకు భారీ నష్టాన్ని మిగిల్చింది. భారతదేశంలో అతిపెద్ద సంస్థ కోల్‌ ఇండియాకు చెందిన మహానంది బొగ్గు క్షేత్రం (ఎంసీఎల్‌)లోని నిషేధిత మైనింగ్ జోన్‌లో జరిగిన ప్రమాదంలో మేక చనిపోయింది. దీంతో  సమీప గ్రామానికి చెందిన స్థానికులు ఆందోళనకు దిగారు.  ఈ ఆందోళనతో సంస్థకు 26.8 మిలియన్ల డాలర‍్ల (రూ.2.7 కోట్ల) నష్టం వాటిల్లింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. మేక మరణంతో తమకు  రూ. 3 కోట్ల  నష్టం వాటిల్లిందని ఎంసీఎల్‌ ప్రతినిధి డికెన్‌ మెహ్రా ఒక ప్రకటనలో  తెలిపారు. 

స్థానికుల ఆందోళన కారణంగా ఎంసీఎల్‌ వద్ద దాదాపు మూడున్నర గంటలు బొగ్గు రవాణా నిలిచిపోయింది. ఉన్నట్టుండి ఆపరేషన్లు నిలిచిపోవడంతో కోట్లాది రూపాయలు నష్టం వచ్చింది. పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాతే పరిస్థితి చక్కబడి, పనులు తిరిగి ప్రారంభమైనట్లు మెహ్రా తెలిపారు. నిరసనకారులపై  స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. స్థానిక ప్రజలు బొగ్గు, కట్టెలకోసం, అలాగే వారి పశువులను మేపడానికి బొగ్గు గని నిషేధిత ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడతారనీ మెహ్రా చెప్పారు.

మరిన్ని వార్తలు