కోవిడ్‌ 19పై టెక్‌ దిగ్గజాల పోరు..

13 Apr, 2020 14:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రపంచ దేశాలు తల్లడిల్లుతున్న క్రమంలో ప్రాణాంతక వైరస్‌ నిరోధానికి టెక్నాలజీ దిగ్గజాలు చేతులు కలిపాయి. కోవిడ్‌-19 కాంటాక్ట్‌ కేసులను స్మార్ట్‌ ఫోన్ల ద్వారా గుర్తించేందుకు యాపిల్‌, గూగుల్‌లు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. వైరస్‌ సోకిన వ్యక్తుల నుంచి కరోనా వైరస్‌ మరొకరికి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మహమ్మారి బారిన పడిన వారితో ఏయే వ్యక్తులు సన్నిహితంగా ఉన్నారని కూపీ లాగడం ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య వర్గాలను కలవరపరుస్తోంది. స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు టెక్‌ దిగ్గజాలు ముందుకొచ్చాయి. స్మార్ట్‌పోన్లలో బ్లూటూత్‌ లో ఎనర్జీ టెక్నాలజీ ద్వారా ఇన్ఫెక్షన్‌ సోకిన వారు ఎవరెవరితో సన్నిహతంగా మెలిగారన్న సమాచారాన్ని వెలికితీసే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నాయి.

ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ ఫోన్లలో ఈ అప్లికేషన్‌ను మే ద్వితీయార్ధంలో అందుబాటులోకి తేనున్నట్టు యాపిల్‌, గూగుల్‌ వెల్లడించాయి. డేటాను సేకరించేందుకు ఈ యాప్స్‌ వైద్యాదికారులకు ఉపకరిస్తాయి. యాపిల్‌ యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఈ యాప్స్‌ను వైద్య సంస్ధలు, ప్రభుత్వ ఏజెన్సీలు నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక రెండో దశలో బ్లూటూత్‌ ఆధారిత కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ యాప్‌లను ఈ రెండు టెక్‌ దిగ్గజాలు అందుబాటులోకి తీసుకొస్తాయి. ఈ యాప్‌ల ద్వారా కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారన్న సమాచారాన్ని పూర్తిగా రాబట్టే వెసులుబాటు ఉంది.

కరోనా పాజిటివ్‌ రోగుల కాంటాక్ట్‌ను పసిట్టి వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్‌లో ఉంచేందుకు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ టెక్నాలజీ కీలకమని యాపిల్‌ అదికారిక ప్రకటనలో పేర్కొంది. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ టెక్నాలజీలో గోప్యత, పారదర్శకత, సమ్మతి ప్రదానాంశాలని భాగస్వాములందరితో సంప్రదించి ముందుకెళతామని,  తాము సేకరించిన వివరాలను ఇతరులు విశ్లేషించుకు వాటిని బహిరంగంగా ప్రచురిస్తామని యాపిల్‌, గూగుల్‌ ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు