'గూగుల్లో వెతకండి.. అన్నిచోట్లా రేప్లే'

4 Jun, 2014 11:09 IST|Sakshi
'గూగుల్లో వెతకండి.. అన్నిచోట్లా రేప్లే'

బడౌన్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, హత్య.. రేప్ను అడ్డుకుందని కిరోసిన్ పోసి తగలబెట్టేశారు.. మహిళా జడ్జిపై ఆమె అధికారిక నివాసంలోనే అత్యాచారం.. మళ్లీ తాజాగా పదిహేనేళ్ల బాలికపై అత్యాచారం, ఉరి.. ఇవన్నీ ఉత్తరప్రదేశ్లో గత వారం రోజులుగా వరుసపెట్టి జరుగుతున్న సంఘటనలు. అయితే, వీటి గురించి ప్రశ్నిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు ఎక్కడలేని కోపం వచ్చింది. గూగుల్ సెర్చిలో వెతికితే దేశవ్యాప్తంగా అన్నిచోట్లా అత్యాచారాలే కనిపిస్తాయని ఆయన అన్నారు. ఇవి కేవలం యూపీలో మాత్రమే జరగట్లేదని, దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాల లెక్కలిచ్చినా మళ్లీ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారని ఆయన విలేకరులతో అన్నారు. ఇది గూగుల్ యుగం కాబట్టి, మీరే ఆన్లైన్లోకి వెళ్లి వెతుక్కోవాలని ఓ ఉచిత సలహా కూడా పారేశారు. కేవలం ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న సంఘటనలను మాత్రమే మీడియా అతిచేసి చూపిస్తోందని ఆరోపించారు. ఇక్కడ జరిగిన ప్రతి కేసులోనూ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అఖిలేష్ అన్నారు.

అయితే.. సెం ఇంత చెబుతున్నా, తమకు మాత్రం బెదిరింపులు వస్తూనే ఉన్నాయని బడౌన్ సంఘటన బాధిత కుటుంబం వాపోతోంది. ''మీడియా వెళ్లిపోతుంది, నాయకులు వెళ్లిపోతారు గానీ ప్రభుత్వం మాత్రం మరో మూడేళ్లు ఉంటుంది. మహాభారత యుద్ధం సృష్టిస్తాం జాగ్రత్త'' అని తనను బెదిరించినట్లు బాధిత బాలిక తండ్రి తెలిపారు.

మరిన్ని వార్తలు