వరికి కనీస మద్దతు ధర పెరిగింది

4 Jul, 2018 14:22 IST|Sakshi
వరి పంటకు పెరిగిన కనీస మద్దతు ధర

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతుల మన్ననలు పొందేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్‌ సీజన్‌లో పండే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర పెంపును కేంద్రం ప్రకటించింది. దీంతో ఖరీఫ్‌ సీజన్‌లో ప్రధాన పంట అయిన వరి కనీస మద్దతు ధర 2018-19లో క్వింటాకు 200 రూపాయలు పెరిగి, రూ.1,750గా నిర్ణయమైంది. 2017-18లో ఈ ధర రూ.1,550గా ఉండేది. గ్రేడ్‌ ఏ రకం వరి కనీస మద్దతు ధర కూడా 160 రూపాయలు పెరిగి రూ.1,750 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 

వరికి కనీస మద్దతు ధర పెరగడంతో, 2016-17(అక్టోబర్‌-సెప్టెంబర్‌) మార్కెటింగ్‌ ఏడాది ప్రకారం ఆహార రాయితీ బిల్లు కూడా రూ.11 వేల కోట్ల కంటే ఎక్కువ పెరగనుందని తెలిసింది. వరితో పాటు పత్తి(మిడియం స్టాపుల్‌) కనీస మద్దతు ధర కూడా రూ.4,020 నుంచి రూ.5,150కు పెరిగింది. అదేవిధంగా పత్తి(లాంగ్‌ స్టాపుల్‌) కనీస మద్దతు ధర కూడా క్వింటాకు రూ.4,320 నుంచి రూ.5,450కు పెంచారు. పప్పు ధాన్యాల కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,450 నుంచి రూ.5,675కు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. 

సన్ ప్లవర్ ధర క్వింటాకు 1,288 రూపాయలు, పెసర్ల ధర క్వింటాకు 1,400 రూపాయలు, రాగుల ధర క్వింటాకు 997 రూపాయలు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్‌ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనే 14 ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరను ఉత్పత్తి ఖర్చు కంటే 1.5 రెట్లు ఎక్కువగా పెంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్‌లో ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి  ఈ నిర్ణయం  తీసుకున్నట్టు తెలిపింది. మంగళవారమే ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌, నీతి ఆయోగ్‌ ప్లానింగ్‌ బాడీ అధికారులు సమావేశమయ్యారు. 

మరిన్ని వార్తలు