గుప్తా ఇంట్లో పెళ్లికి 200 కోట్ల ఖర్చు!

25 Jun, 2019 15:00 IST|Sakshi

అవులీ (ఉత్తరాఖండ్‌) : భారత్‌లో పుట్టి, దక్షిణాఫ్రికాలో స్థిరపడిన వివాదాస్పద వ్యాపారవేత్త అజయ్‌ గుప్తా తనయుడు సూర్యాకాంత్‌ వివాహం ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు.. అదే కుటుంబానికి చెందిన అతుల్‌ గుప్తా కుమారుడు షశాంక్‌ వివాహం 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వీటికి పలువురు ముఖ్యమంత్రులతోపాటు కత్రీనా కైఫ్, బాబా రాందేవ్‌ లాంటి సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. పెళ్లిళ్లకు వచ్చిన అతిథుల కోసం రాందేవ్‌ బాబా రెండు గంటలపాటు యోగా సెషన్‌ కూడా నిర్వహించారు. అతిథుల కోసం వారం రోజుల పాటు అవులీ పట్టణంలోని అన్ని హోటళ్లను, రెస్టారెంట్లను బుక్‌ చేశారు.

అన్ని హంగులతో జరిగిన ఈ పెళ్లిళ్లకు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఒక్క విశేషమైతే, తిని పడేసిన చెత్త నాలుగు వేల కిలోలు ఉండడం ఒక విషాదం. ఈ చెత్తను ఎలా, ఎక్కడికి తరలించాలో తెలియక నగర పాలికా పరిషత్‌ సూపర్‌వైజర్‌ అనిల్, ఆయన 20 మంది సిబ్బంది తలపట్టుకొని కూర్చున్నారు. ఆ చెత్తలో ప్లాస్టిక్‌ ఎక్కువగా ఉందని, కొండ ప్రాంతంలో తిరిగే తమ పశువులు ఆ ప్లాస్టిక్‌ కాగితాలను మింగేస్తే ఎంత ప్రమాదమని స్థానికులు వాపోతున్నారు. అయితే, ఈ చెత్తను తరలించేందుకు స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ. 54వేలు డిపాజిట్‌ చేసిన గుప్తా కుటుంబం.. ఇప్పుడు ఆ చెత్త తరలించడానికి ఎంత ఖర్చైతే.. అంత చెల్లించేందుకు ముందుకొచ్చింది.

>
మరిన్ని వార్తలు