ఆవు మూత్రం తాగించి, పేడ తినిపించారు

28 Jun, 2016 11:38 IST|Sakshi
ఆవు మూత్రం తాగించి, పేడ తినిపించారు

న్యూఢిల్లీ: గో రక్షణ  సమితి సభ్యుల అకృత్యం ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బీఫ్ ను  ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు యువకుల చేత బలవంతంగా ఆవు మూత్రం తాగించి, ఆవు పేడ తినిపించిన వైనం విమర్శలకు  తావిచ్చింది. అక్రమంగా బీఫ్ ను తరలిస్తున్నారని ఆరోపిస్తూ వారిపై భౌతికంగా దాడిచేసి పంచగవ్య తినిపించారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.  

గో రక్షణ  సమితి  అధ్యక్షుడు ధర్మేంద్ర యాదవ్, అతని సహచరులు గుర్గావ్  లో ఇద్దరు యువకులు రిజ్వాన్, ముక్తియర్ లపై  ఈ దారుణానికి పాల్పడ్డారు.  యువకులిద్దరు 'పంచగవ్య'తో కూర్చొని ఉండడం, దాన్ని సులభంగా మింగడానికి గో రక్షణ కార్యకర్తలు నీళ్లు ఇవ్వడం.. తినమని గద్దించడం ఈ వీడియోలో చూడవచ్చు.  'గోమాత కీ జై',  'జై శ్రీ రామ్' అంటూ నినాదాలు  చేశార.

అయితే రిజ్వాన్, ముక్తియర్ అక్రమంగా  7 వందల కేజీ గొడ్డు మాంసాన్ని రవాణా చేస్తున్నారని ధర్మేంద్ర ఆరోపించారు. మేవాత్ నుంచి ఢిల్లీకి  తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. అందుకే వారికి గుణపాఠం చెప్పాలనే పంచగవ్య (ఆవు మూత్రం.. పేడ. పాలు పెరుగు, నెయ్యిల మిశ్రమం) తినిపించామని తెలిపారు. దీని ద్వారా వారిని పరిశుద్ధులను చేశామన్నారు. దీన్ని వీడియో ఎవరు తీశారో, బయటికి ఎలా వచ్చిందో తమకు తెలియదన్నారు.


3 వందల కేజీల బీఫ్ ను స్వాధీనం చేసుకున్నామని ఫరీదా  పోలీస్ అధికారి  తెలిపారు. గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు  నిందితులను  జ్యుడీషియల్ కస్టడీకి పంపామన్నారు. అయితే బలవంతంగా పేడ, మూత్రం తినిపించిన అంశం తమ దృష్టికి రాలేదన్నారు. 
 

మరిన్ని వార్తలు