ఆత్మహత్య ఆలోచన వెంటాడింది

5 Nov, 2018 03:30 IST|Sakshi
ఏఆర్‌ రెహమాన్‌

నా పేరును కూడా విపరీతంగా ద్వేషించేవాడిని

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌

ముంబై: పాతికేళ్ల వయస్సు వచ్చేవరకూ రోజూ తనను ఆత్మహత్య ఆలోచనలు వెంటాడేవని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహమాన్‌(51) తెలిపారు. చిన్నవయసులోనే తండ్రిని కోల్పోవడంతో తాను జీవితంలో విఫలమయ్యానన్న భావన కలిగేదని వెల్లడించారు. రచయిత కృష్ణ త్రిలోక్‌ రాసిన ‘నోట్స్‌ ఆఫ్‌ ఏ డ్రీమ్‌: ది ఆథరైజ్డ్‌ బయోగ్రఫీ ఆఫ్‌ ఏఆర్‌ రెహమాన్‌’ పుస్తకాన్ని ఆదివారం నాడిక్కడ రెహమాన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన తండ్రి చనిపోవడం, కెరీర్‌లో తొలి అడుగులు, పనిచేసే విధానం సహా పలు అంశాలపై ఆయన మీడియాతో ముచ్చటిం చారు.

‘25 సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ నేను ప్రతిరోజూ ఆత్మహత్య చేసుకోవడం గురించి ఆలోచించేవాడిని. ఆ వయస్సులో విజయవంతం కాలేకపోయామన్న భావన మనలో చాలామందికి ఉంటుంది. నాన్న ఆర్కే శేఖర్‌ చనిపోవడంతో నాలో శూన్యత ఏర్పడింది. అప్పుడు నాలో ఎక్కువ సంఘర్షణ చోటుచేసుకుంది. కానీ అవే నన్ను ధైర్యవంతుడిగా మార్చాయి. అందరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. ప్రతీదానికి తుది గడువు అంటూ ఉన్నప్పుడు ఇక భయపడటం దేనికి?’ అని రెహమాన్‌ వ్యాఖ్యానించారు.  

‘రోజా’కు ముందే మతం మారాను
‘నాన్న మరణం తర్వాత నేను పనిపై దృష్టి పెట్టలేకపోయా. ఆయన పనిచేసే విధానం చూశాక నేను ఎక్కువ సినిమాలను తీసుకోలేదు. 35 చిత్రాలకు పనిచేయాలని ఆఫర్లు వస్తే కేవలం రెండింటినే అంగీకరించా. అప్పుడు ప్రతిఒక్కరూ ‘ఇలా అయితే నువ్వు ఎలా బతుకుతావు? వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచించారు. కానీ అప్పటికి నా వయస్సు కేవలం 25 సంవత్సరాలే. కానీ చెన్నైలోని నా ఇంటివెనుక సొంత రికార్డింగ్‌ స్టూడియోను నిర్మించుకోవడం నా జీవితాన్ని మలుపు తిప్పింది.

వచ్చిన అన్ని సినిమా ఆఫర్లను నేను అంగీకరించలేదు. ఆఫర్లు అన్నింటిని అంగీకరించడం అంటే అందుబాటులో ఉన్న ప్రతీదాన్ని తినేయడమే. అలా చేస్తే నిస్తేజంగా మారిపోతాం. మనం కొద్దికొద్దిగా తిన్నా దానిని పూర్తిగా ఆస్వాదించాలి. నా జీవితంలో 12 నుంచి 22 ఏళ్ల మధ్య అన్నింటిని పూర్తిచేసేశా. పాతికేళ్లు ఉన్నప్పుడు మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ సినిమాకు పనిచేశా. ఆ సినిమాకు కొన్నిరోజుల ముందు నా పేరును, మతాన్ని మార్చుకున్నా. ఎందుకో నా గతాన్ని, దిలీప్‌ కుమార్‌ అనే నా పేరును విపరీతంగా ద్వేషించేవాడిని.

అదెందుకో నాకు ఇప్పటికీ తెలియదు. సినిమాలకు సంగీతం సమకూర్చడానికి మనలోమనం లీనమైపోవ డం చాలాముఖ్యం. అందుకే నేను ఎక్కువగా రాత్రిపూట, తెల్లవారుజామున ప్రశాంత వాతావరణంలో పనిచేస్తుంటాను. ప్రయాణాలు చేయడం, కుటుంబంతో గడపడం ద్వారా నా పనిఒత్తిడి నుంచి బయటపడతాను’’ అని రెహమాన్‌ పేర్కొన్నారు. రచయిత కృష్ణ త్రిలోక్‌ రాసిన ఈ పుస్తకాన్ని ల్యాండ్‌మార్క్‌ అండ్‌ పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ప్రచురించింది.

మరిన్ని వార్తలు